పర్యవేక్షణ.. పకడ్బందీ నిర్వహణ
● ఎన్నికల కేంద్రంగా కరీంనగర్ కలెక్టరేట్
● నాలుగు ఉమ్మడి జిల్లాల పర్యవేక్షణ అంతా ఇక్కడే
● ఎమ్మెల్సీ ఎన్నికల విజయవంతంలో కీలక భూమిక
కరీంనగర్ అర్బన్:
కలెక్టరేట్.. పరిపాలనకు కేంద్రం. ఎన్నికలొచ్చాయన్నా కలెక్టరేటే కీలకం. ఎన్నికలకు సమాయత్తమవడం నుంచి ఓట్ల లెక్కింపు వరకు కలెక్టరేట్‌లోని కీలక విభాగాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేసింది. నాలుగు ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు కరీంనగర్ కలెక్టరేట్ కీలకంగా వ్యవహరించింది. ఓటరు చైతన్యం నుంచి ఓటేసే వరకు, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవడం, ఓట్ల లెక్కింపు వరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది. ఒక్కో దానికి ఒక్కో నోడల్ అధికారి విధులు నిర్వహించగా అన్ని విభాగాల బాధ్యత కలెక్టరేట్‌దే.
● మానవ వనరులు: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో 15 జిల్లాలుండగా 41 నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ రోజు ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వర్తించాలనేది ఈ విభాగం నిర్ణయించింది. పేస్కేల్‌ను పరిగణనలోకి తీసుకుని వివిధస్థాయిలో అధికారులను నియమించింది.
● శిక్షణ విభాగం: ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ విభాగం ప్రధాన విధి. నియమావళి అమలుపై శిక్షణ ఇచ్చారు.
● సామగ్రి పంపిణీ: ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి గుర్తించడం, వాటిని సమకూర్చుకోవడం వంటి వాటికి ఈ విభాగం పని చేసింది.
● రవాణా సౌకర్యం: పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు సామగ్రి రవాణా చేయడమే ఈ విభాగం పని. జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, బ్యాలెట్ బాక్స్‌లు, పోలీసులను సకాలంలో చేర్చటం ఈ విభాగం విధి. బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలోకి చేర్చడంలోనూ భాగస్వామ్యం.
● బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణ: ఓటింగ్‌లో కీలకమైన బ్యాలెట్ బాక్స్‌లను కేంద్రాలకు చేర్చటం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్ట్రాంగ్ గదుల్లో భద్రపరిచారు.
● ప్రవర్తన నియమావళి: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెడుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
● ఫిర్యాదులపై స్పందన: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఈ విభాగం స్పందిస్తుంది. డయల్ 1950, సీ–విజిల్, సువిధ యాప్‌ల వంటి వాటికి అందే ఫిర్యాదులు రికార్డు చేసుకుని పరిష్కరించింది.
● పోస్టల్ బ్యాలెట్: పోలింగ్ సిబ్బందిని గుర్తించి వారంతా ఓటేసేలా ఇది పని చేసింది.
● చైతన్యం: ఓటు హక్కు వినియోగంపై చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ విభాగం పని చేసింది. గతంలో పోలింగ్ తక్కువ నమోదైన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా సఫలీకృతమైంది.
● శాంతి భద్రతల పరిరక్షణ: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించి వాటిపై నిఘా పెట్టడం, ఆయుధాలు ఉన్న వారి వివరాల సేకరణ, తదితర కార్యకలాపాలను ఈ విభాగం పర్యవేక్షించింది.
● ఐటీ, కంప్యూటరైజేషన్: సాంకేతిక అంశాలపై ఐటీ, కంప్యూటరైజేషన్ విభాగం పని చేసింది. యాప్‌ల పని తీరు, వాటి నిర్వహణను పర్యవేక్షిస్తుంది. సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించింది.
● వ్యయ నిర్ధారణ: అభ్యర్ధుల ఖర్చులను లెక్కించటానికి వ్యయ నిర్ధారణ విభాగం పని చేసింది. సభలు, సమావేశాలు, వ్యయాన్ని ఆయా అభ్యర్థుల ఖర్చుల్లో చూపింది. ఖర్చులకు సంబంధించిన వీడియో, సీడీల రూపంలో ఎన్నికల సంఘానికి పంపించింది.
● ప్రసార సాధనాలపై పర్యవేక్షణ: మీడియాలో ప్రసారం, ప్రచురితమయ్యే వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నియమావళికి విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తించింది.
పట్టభద్రుల ఓటర్లు 3,55,159
ఉపాధ్యాయ ఓటర్లు 27,088
మైక్రో అబ్జర్వర్లు 394
జోనల్ అధికారులు 335
పోలింగ్ అధికారులు 2,606
ప్రిసైడింగ్ అధికారులు 864
మొత్తం పోలింగ్ కేంద్రాలు 680
కామన్ పోలింగ్ స్టేషన్లు (టీచర్స్‌అండ్ గ్రాడ్యుయేట్స్) 93
పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు 406
ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలు 181
Comments
Please login to add a commentAdd a comment