పైసలు మాకు!
పండుగ మీకు..
● రెండు నెలల్లో జంబో కూలర్ల అద్దె రెట్టింపు ● పరిపాలన అనుమతులివ్వడంలో చేతివాటం ● అవినీతా? లేక పద్ధతి ప్రకారం లూఠీనా? ● రంజాన్ ఏర్పాట్లలో పెరిగిన ఐటెంల ఖర్చు
కరీంనగర్ కార్పొరేషన్:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మరోసారి అవినీతి బాగోతం వెలుగుచూసింది. ఈసారి రంజాన్ పండగను ఆసరాగా చేసుకున్న అధికారులు టెండర్లలో ఐటెంల రేట్లు పెంచి తమ సత్తా చాటుకున్నారు. రెండు నెలల కాలంలో ఐటెంల రేట్లు రెట్టింపు చేసి ఖజానాకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. కరీంనగర్ హౌజింగ్‌బోర్డ్‌కాలనీలో జనవరిలో స్మార్ట్‌సిటీ 24 గంటల నీటి సరఫరా కార్యక్రమం ప్రారంభం కోసం బల్దియా అధికారులు రూ.14.80 లక్షలతో టెండర్లు పిలిచారు. అందులో టెంట్లు, ఫ్లెక్సీలు, జనరేటర్లు, సౌండ్ సిస్టమ్, సోఫాలు, ఫైబర్ చైర్లు తదితర ఐటెంలు టెండర్ల ద్వారా తెప్పించారు. తా జాగా రంజాన్ పండుగ కోసం ఇవే ఐటెంలకు టెండర్లు పిలిచారు. అయితే, ఇక్కడే అధికారులపై విమర్శలు వస్తున్నాయి. కేవలం రెండునెలల కాలంలో కొన్ని ఐటెంల రేట్లు అమాంతంగా పెరిగిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్లకు ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా
గత జనవరిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా టెంట్లు, ప్లెక్సీలు, జనరేటర్లు, సౌండ్ సిస్టమ్, సోఫాలు, ఫైబర్ చైర్లు తదితర ఐటెంలు టెండర్ల ద్వారా తెప్పించారు. ఇందులో ఒక్క జంబో కూలర్ రేటును రూ.1200, ఫైబర్ చైర్ ఒక్కదానికి రూ.8, 125 కేవీ జనరేటర్ రోజుకు రూ.15,000 చొప్పున, పైప్ అండ్ పెండల్ (టెంట్) చదరపు అడుగుకు రూ.3గా కోట్ చేసి డబ్బులు చెల్లించారు. అయితే, తాజాగా రంజాన్ పర్వదినం ప్రార్థనల కోసం సాలేహ్‌నగర్ ఈద్గాల కోసం జంబో కూలర్ రేటును రూ.2500గా (పది కూలర్లు), ఫైబర్ చైర్లను రూ.10గా (250 కుర్చీలు), 7.5 కేవీ జనరేటర్ (ఒక్కటి)ను గంటకు రూ.1,576గా నిర్ణయించారు. పైప్ అండ్ పెండల్ (టెంట్) చదరపు అడుగుకు రూ.3.50 (75,168 చదరపు అడుగులు)గా పేర్కొన్నారు.
● కేవలం సాలేహ్ నగర్ ఈద్గాలోనే పైప్ అండ్ పెండల్ (టెంట్) చదరపు అడుగుకు రూ.3.50 వసూలు చేశారు. అంటే గతం కన్నా రూ.0.50 పైసలు మాత్రమే అదనం. కానీ, 75,168 చదరపు అడుగులకు రూ.37,584 వేలు అదనపు చెల్లించారు.
● జంబో కూలర్ల విషయంలో రూ.1300పెంచడం వల్ల అదనంగా రూ.13 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఇంకా సప్తగిరి కాలనీ, చింతకుంట ఈద్గాలను కలుపుకుంటూ.. ఐటెంల రేట్లు కలిపితే ఈ దుబారా మరింత అధికంగా (రూ.లక్షల్లో) ఉంటుంది.
● అయితే, ఈ ఐటెంల రేట్ల నిర్ణయించడానికి స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్‌ఎస్‌ఆర్)ను లేదా కొటేషన్లు పిలిచి వాటిని ఫాలో కావాలి. కానీ, అధికారులు ఇవేమీ పాటించినట్లు కనిపించడం లేదు.
● పండగల పేరిట ఇలాంటి పారదర్శకత లేని పనులు చేపడుతూ.. బల్దియా ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యవహారా లపై కమిషనర్, అడిషనల్ కలెక్టర్ (ఎల్‌అండ్‌బీ), కలెక్టర్ పట్టించుకోకపోవడంతో అంచనాల పెంపు సర్వసాధారణంగా మారుతోంది.
పైసలు మాకు!
Comments
Please login to add a commentAdd a comment