వృద్ధురాలి దారుణహత్య
కొత్తపల్లి(కరీంనగర్): వృద్ధురాలి గొంతుకోసి హత్యచేసిన ఘటన కొత్తపల్లి (హెచ్) ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జరిగింది. ప్రయాణికులు, స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుందరయాదవ్, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్‌కుమార్ పరిశీలించారు. మృతురాలు తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన తనుకు వెంకటమ్మ (70)గా గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు, హత్య చేసింది ఎవరు.. కొత్తపల్లి కెనాల్ వద్దే చంపేసారా..ఇతర ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ వదిలేసారా..? అన్న విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కాగా కోహెడ మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన మృతురాలి పెద్ద కుమార్తె లక్ష్మీ సమాచారం తెలియగానే ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే డబ్బుల విషయంలోనే వృద్ధురాలిని కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్ క్రైం: ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన గంపల సంపత్ (38)కు భార్య, కూతురు, కొడుకు ఉండగా కుటుంబ సమస్యల కారణంగా భార్యతో విడాకులయ్యాయి. పిల్లలకు దూరంగా ఉండడంతోపాటు ఒంటరితనం భరించలేక మనోవేదనకు గురవుతున్న సంపత్ తన తండ్రి గంపల సాయిలు వద్ద ఉంటున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment