పది పరీక్షలకు 12,516 మంది
● టెన్త్ ఎగ్జామ్స్‌కు అంతా రెడీ ● నేటి నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు పరీక్షలు ● గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి ● జిల్లాలో 73 కేంద్రాల ఏర్పాటు
కరీంనగర్: పదోతరగతి పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ 12,516 మంది, ప్రైవేట్ విద్యార్థులు 24 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 73 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇద్దరు అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు, ఐదు ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలు, 694 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని అధికారులు వెల్లడించారు.
ఏర్పాట్లు పూర్తి..
కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతీరోజు పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ఆయా పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష సమయాని కంటే ముందుగా తీసుకువచ్చే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంట్ అధికారులు (డీవో)లకు ఆదేశాలు జారీ చేశారు.
సీసీ కెమెరాల నిఘా..
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష పేపర్ల సీల్ ఓపెన్ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయి వాటిని సీల్ చేసేంత వరకు సీసీ కెమెరాల్లో రికార్డు కానున్నాయి.
సందేహాలుంటే కాల్‌చేయండి..
అత్యవసరంగా ఫిర్యాదుల కోసం డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్ నంబరు 9441130379ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
సమస్యలుంటే హెల్ప్‌లైన్ నంబరు 9441130379 కాల్‌చేయొచ్చు
Comments
Please login to add a commentAdd a comment