లేబర్ కార్డుకు దూరం
అవగాహన లోపం..
● ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షలకు మించని కార్డులు
● ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న కార్మికులు
● అవగాహన కల్పిస్తే మరింత మందికి ప్రయోజనం
కరీంనగర్ 1,15,705
పెద్దపల్లి 84,974
జగిత్యాల 76,146
సిరిసిల్ల 54,739
మొత్తం 3,31,564
2014 నుంచి ఇప్పటి వరకు..
క్లెయిమ్‌లు: 49,795
చెల్లించిన డబ్బు: రూ.22,76,82,588
కరీంనగర్‌టౌన్: ఉమ్మడి జిల్లాలో కార్మికులకు తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడంతో లేబర్ కార్డులకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం చాలా పథకాలు అమలులోకి తెస్తుండడంతో ఇప్పుడిప్పుడే కార్డులు పొందేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ప్రభుత్వం తరఫున కూడా అవగాహన కల్పించడంలో విఫలం అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కార్మికులు సాధారణంగా లేబర్ కార్డుల గురించి అవగాహన పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి జిల్లాలో 3.3 లక్షల కార్డులే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 లక్షల పైగా జనాభా ఉండగా, ఇందులో 70 శాతం మంది వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. అంటే దాదాపు 20 లక్షల పైచిలుకు కార్మికులు ఉండగా కేవలం 3.3 లక్షల మంది మాత్రమే లేబర్ కార్డులు పొందడం గమనార్హం. ఈ గణాంకాలను చూస్తే కేవలం 10 శాతం లోపు మాత్రమే ఈ కార్డులు పొందారని తెలుస్తోంది.
లేబర్ కార్డు పొందితే ప్రయోజనాలు
● లేబర్ కార్డు ఉన్న వ్యక్తి కూతుళ్ల పెళ్లికి రూ.30,000, ప్రసవానికి రూ.30,000 (ఇద్దరు కూతుళ్లకు మాత్రమే) ఒక సంవత్సరం ముందు బోర్డు నందు కార్మికుడు /కార్మికురాలుగా నమోదైనవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
● ప్రమాదం వల్ల చనిపోతే బాధిత కుటుంబానికి రూ.6,30,000, సాధారణ మరణానికి రూ.1,30,000 ఆర్థికసాయం అందుతుంది.
● కార్మికునికి దహన సంస్కార ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు.
● ప్రమాదవశాత్తు అంగవైకల్యం కలిగినవారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం అందజేస్తారు.
● తాత్కాలిక వైద్య ఖర్చుల కింద కార్మికులకు నెలకు రూ.4,500 చొప్పున గరిష్టంగా రూ.13,500 సహాయం అందుతుంది.
అర్హులు తీసుకోవాలి
వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్న అర్హులందరూ లేబర్ కార్డులు తీసుకోవాలి. కార్డులు లేని చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేబర్ కార్డులపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేసి, కార్మికులందరికీ కార్డులు అందేలా చర్యలు చేపట్టాలి. – కన్నం లక్ష్మణ్,
కార్మిక సంఘం నాయకుడు
నిరంతరం అందజేస్తున్నాం
లేబర్ కార్డు పొందేందుకు నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు. కార్మికులుగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ లేబర్ కార్డులు అందజేయడం జరుగుతుంది. 3.3 లక్షల మంది ఇప్పటి వరకు కార్డులు కలిగి ఉన్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే మనం మెరుగ్గా ఉన్నాం. కార్మికులకు అవగాహన కల్పించి మరింత మంది కార్డులు పొందేలా ప్రోత్సహిస్తాం.
– వెంకటరమణ,
డిప్యూటీ లేబర్ కమిషనర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా
లేబర్ కార్డుకు దూరం
లేబర్ కార్డుకు దూరం
Comments
Please login to add a commentAdd a comment