మూడునెలల కష్టం బుగ్గిపాలు
వీణవంక(హుజూరాబాద్): జాతరలో స్వీట్ దుకాణం పెట్టుకొని కాలం వెల్లదీస్తున్న ఆ కుటుంబం రోడ్డునపడింది. మూడునెలల పాటు వివిధ జాతరలు తిరిగి వచ్చిన డబ్బుతో తమ వాహనంలో ఇంటికి రాగా షార్ట్‌సర్క్యూట్‌తో మూడునెలల కష్టం బుగ్గిపాలైన ఘటన వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. నిదానం మహేందర్ వివిధ జిల్లాల్లో ఎక్కడ జాతర జరిగినా అక్కడ స్వీట్ దుకాణం పెట్టి బతుకు వెల్లదీస్తున్నాడు. మూడునెలల క్రితం తన ట్రాలీ ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి జాతర్లకు వెళ్లాడు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ జాతర చూసుకొని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి మహేందర్ కుటుంబం అలిసిపోవడంతో స్వీట్‌కు సంబంధించిన ముడిసరుకులతో పాటు, రూ.2.16లక్షలు తన ఆటోలో ఉంచి ఇంట్లో నిద్రపోయాడు. ఆటో పైన ఉన్న విద్యుత్ వైరు గాలికి తెగి ఆటోలో ఉన్న వస్తువుల మీద పడటంతో ముడి సరుకులతో పాటు నగదు కాలిపోయాయి. వేకువజామున చూసేసరికి అప్పటికే నష్టం జరిగిపోయిందని బాధితుడు విలపించాడు. ఉన్న ఆధారం బుగ్గిపాలైందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment