పెద్దపల్లి బైపాస్ సిద్ధం!
● నేటి నుంచి 28 వరకు ఇంటర్‌లాకింగ్ పనులు ● ఉగాది నుంచి అందుబాటులోకి 1.7 కి.మీ సింగిల్ లైన్ ● ఇకపై ప్రతీ రైలుకు 40 నిమిషాలు ఆదా ● తొలుత గూడ్స్, ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లకు మేలు ● త్వరలో డబుల్ ట్రాక్.. టెండర్లు పిలిచిన రైల్వే శాఖ
సాక్షిప్రతినిధి, కరీంనగర్/పెద్దపల్లి రూరల్:
ఎప్పుడెప్పుడా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ సిద్ధమైంది. కాజీపేట – బల్హార్షా – పెద్దపల్లి – నిజామాబాద్ సెక్షన్లను కలిపేలా నిర్మించిన రైల్వేలైన్ ఇంటర్ లాకింగ్(కమిషన్) పనులు నేటినుంచి ఈనెల 28వ తేదీ వరకు జరగనుండగా.. ఉగాది నుంచి లైన్ అందుబాటులోకి రానుంది. దాదాపు 1.78 కి.మీ. దూరం కలిగిన ఈ సింగిల్ రైల్వేలైన్.. మంగళవారం నుంచి సేవలు అందించనుంది. ఈ మేరకు ఇంటర్‌లాకింగ్ పనులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేపట్టనున్నారు. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే ప్రతీ గూడ్స్ రైలు ఇకపై పెద్దపల్లి స్టేషన్‌లో సిగ్నల్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణించే వీలు కలుగనుంది.
ప్రతీరైలుకు 40 నిమిషాలు ఆదా..
వాస్తవానికి పెద్దపల్లి– నిజామాబాద్ సెక్షన్ నుంచి కాజీపేట – బల్హార్షా మీదుగా ప్రయాణించే రైళ్లు ఇంతకాలం పెద్దపల్లి స్టేషన్‌లో పడిగాపులు పడేవి. సరైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థ లేకపోవడంతో కాజీపేట– బల్హార్షా సెక్షన్ నుంచి రైలు పెద్దపల్లి –నిజామాబాద్ సెక్షన్‌లోకి రావాలంటే.. నిజామాబాద్ నుంచి కాకినాడ పోర్ట్, మహారాష్ట్రకు వెళ్లాల్సిన గూడ్స్ పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దాదాపు 40 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు సిగ్నల్ కోసం వేచి చూడాల్సి వచ్చేది. బైపాస్ లైన్ అందుబాటులోకి రాగానే.. ఇకపై రైళ్లు పెద్దపల్లి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం సరుకు రవాణా రైళ్లకు మాత్రమే వర్తిస్తుంది. త్వరలో ప్యాసింజర్ రైళ్లకు కూడా వర్తించనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment