గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
కోరుట్ల: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు తెలిపారు. సోమవారం ఆయన కోరుట్ల సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెట్‌పల్లికి చెందిన గోల్కోండ హరీశ్, బొల్లంపల్లి అభిషేక్ మేడిపల్లి శివారు కట్లకుంట రోడ్డు సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో మేడిపల్లి ఎస్సై శ్యాంరాజ్ వెళ్లి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. హరీష్, అభిషేక్ నుంచి 2.200కిలోల గంజాయి లభించింది. దాని విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నిందితులు ఒడిశాకు చెందిన దీపక్ అలియాస్ సూరజ్ నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లలోకి మార్చి జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో అమ్ముతున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించిన సీఐ సురేష్‌బాబు, ఎస్సైలు శ్యాంరాజ్, శ్రీకాంత్, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, రాజశేఖర్, మహేశ్వర్, భగవాన్‌కు నగదు రివార్డులు అందించినట్లు డీఎస్పీ తెలిపారు.
‘ఉపాధి’ కూలీకి పాముకాటు
కథలాపూర్: కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ తోట మమత సోమవారం పని ప్రదేశం వద్ద పాము కాటుకు గురైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామశివారు ఈర్లగుట్ట వద్ద కందకాలు తవ్వే పనులకు మమత వెళ్లింది. తోటి కూలీలతో కలిసి కందకాలు తవ్వుతుండగా.. కాలుపై పింజర పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురైంది. తోటి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెను చికిత్స నిమిత్తం కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టెక్నికల్ అసిస్టెంట్ అంబాజీ ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.
పెట్రోల్ బంక్ సీజ్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్‌ను సీజ్ చేసినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని భార్గవి సర్వీస్ స్టేషన్‌ను సోమవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్రభంగా లైసెన్స్ లేదని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం రాజేందర్ మాట్లాడుతూ, పెట్రోల్ బంక్ యజమాని వి.రమేశ్.. ఫారం– బీ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు తేలిందన్నారు. బంక్‌లో రూ.20లక్షల 37 వేల 248 విలువైన 9,992 లీటర్ల పెట్రోల్, 10,022 లీటర్ల డీజిల్ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్లు సంతోష్‌సింగ్, ఠాగూర్, రవీందర్, అధికారులు పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment