సమస్యల పరిష్కారానికి ఆమరణదీక్ష
కోల్‌సిటీ(రామగుండం): డివిజన్ సమస్యల పరిష్కారం కోసం మేకల అబ్బాస్ యాదవ్ మండుటెండను సైతం లెక్క చేయకుండా సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. డివిజన్ యువకులు మద్దతుగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ 48వ డివిజన్ మారుతీనగర్‌లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన అబ్బాస్.. సమస్యల పరిష్కారంలో అధికారులు హామీ ఇచ్చేంత వరకు నిరసన దీక్ష విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. అబ్బాస్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు, అధికారులు అసంపూర్తిగా వదిలేశారన్నారు. వాటర్ ట్యాంక్ నుంచి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వరకు రోడ్డు నిర్మించాలని, రాష్ట్రంలోనే దుమారం లేపిన స్క్రాప్ కుంభకోణం కేసు పరిష్కరించి, ఆ నిధులను డివిజన్ అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ ఆస్పత్రి భవనంలోని గదిని మాజీ కార్పొరేటర్ భర్త పొన్నం లక్ష్మణ్ అక్రమంగా తన సొంత పనులకు వాడుకుంటున్నాడని, వెంటనే ఆ గదిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకొని వెటర్నరీ హాస్పటల్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. దీక్ష విరిమింపజేయడానికి పోలీసులు ప్రయత్నం చేసినా.. వినలేదు. మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే హామీ ఇచ్చేంతవరకు నిరసన విరమించేది లేదని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
స్క్రాప్ కుంభకోణంలో
నిధుల రికవరీకి డిమాండ్
మండుటెండలో యువకుని నిరాహార దీక్ష
Comments
Please login to add a commentAdd a comment