సైదాపూర్: మండలంలోని జాగీర్‌పల్లికి చెందిన పోలుదాసరి సమ్మయ్య(57) ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. సైదాపూర్ ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. జాగీర్‌పల్లికి చెందిన పోలుదాసరి సమ్మయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కామని చంద్రయ్యకు చెందిన మొక్కజొన్న లోడ్‌ను తీసుకుని గురువారం ఉదయం మొలంగూర్ వైపు బయల్దేరాడు. సోమారం గ్రామ శివారులో బహుర్బూమికని ట్రాక్టర్‌ను ఆపాడు. కాసేపటికి ట్రాక్టర్ న్యూట్రల్ అయ్యి ముందుకు కదిలింది. దీంతో వెంటనే ట్రాక్టర్ ఎక్కి ఆపేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పెద్దటైరు కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమ్మయ్య భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపతి తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
రామగుండం: మతిస్థిమితం సరిగా లేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం పట్టణంలోని సీ–కాలనీ జెన్‌కో క్వార్టర్‌లో జరిగింది. ఎస్సై సంధ్యారాణి తెలిపిన వివరాలు.. జెన్‌కో ఉద్యోగి తాటిపెల్లి కృష్ణమూర్తి భార్య పద్మ (44 కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
కరీంనగర్‌క్రైం: గంజాయి తరలిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వన్‌టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన నీరజ్‌కుమార్, సోనుకుమార్, దిలేంధర్‌కుమార్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ కూలీ పని చేసుకుంటున్నారు. ముగ్గురు కలిసి 1.180 కేజీల గంజాయి తీసుకుని వెళ్తుండగా అంబేద్కర్ స్టేడియం వద్ద పోలీసుల కంట పడ్డారు. పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎస్సైలు రాజన్న, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
సైబర్ నేరస్తుడి రిమాండ్
గోదావరిఖని(రామగుండం): ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైం ఏసీపీ వెంకటరమణ తెలిపిన వివరాలు.. గోదావరిఖనిలో ఉంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని గతేడాది నవంబర్‌లో రూ.57.13లక్షలు కోల్పోయాడు. సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా అహుల్యానగర్ మండలం, నపవాడి గ్రామానికి చెందిన శుభం నవనాథ్‌షెల్కేను పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వాట్సప్ లింక్ పంపి సైబర్‌మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు. మొదట్లో కొన్ని డబ్బులు పెడితే డబుల్ వచ్చినట్లు ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతాలో చూపించడంతో బాధితుడు నమ్మి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడని పేర్కొన్నారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సైబర్‌క్రైం ఏసీపీ పేర్కొన్నారు.