
హుబ్లీ: రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతానికి మహారాష్ట్ర సర్కారు నుంచి నిధులు కేటాయిస్తే తానెందుకు రాజీనామా చేయాలని సీఎం బొమ్మై ప్రశ్నించారు. బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీకే.శివకుమార్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.54 కోట్లను విడుదల చేసిన అంశంపై కేపీసీసీ అధ్యక్షులు డీకే.శికుమార్ తన రాజీనామాకు డిమాండ్ చేసిన విషయంపై సీఎం పైవిధంగా స్పందించారు.
తాము కూడా మహారాష్ట్రలోని పండరాపుర, తులజాపుర వెళ్లిన కర్ణాటక వారికి నిధులు విడుదల చేశామన్నారు. మహారాష్ట్ర సర్కారు ఏ నిధులు మంజూరు చేసిందో పరిశీలిస్తానన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలను ఏ విధంగా ఎదుర్కోవాలో సమీక్షిస్తానన్నారు. నేల, నీరు, భాష సరిహద్దు రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా రాష్ట్ర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన హుబ్లీకి వచ్చి స్వగ్రామంకమడొళ్లిలోని బంధువులను, స్నేహితులను కలిసి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు.