
పిల్లలకు వేసవి సెలవులు కావడంతో కొత్త ప్రదేశాలు చూసి వద్దామని అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన 13 మంది పిల్లాపాపలతో బయల్దేరారు.
సాక్షి, బెంగళూరు/ మైసూరు: పిల్లలకు వేసవి సెలవులు కావడంతో కొత్త ప్రదేశాలు చూసి వద్దామని అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన 13 మంది పిల్లాపాపలతో బయల్దేరారు. కానీ అదే తమ పాలిట మృత్యు ప్రయాణవుతుందని ఊహించలేకపోయారు. ప్రైవేటు బస్సు– ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీ కొన్న దుర్ఘటనలో ఇన్నోవాలోని పదిమంది విగతజీవులయ్యారు. ఇందులో డ్రైవర్ తప్ప 9 మంది సమీప బంధువులే. సోమవారం మధ్యాహ్నం మైసూరు జిల్లా తి.నరసీపుర తాలూకా కురుబూరు గ్రామం పింజరపూల్ వద్ద కొళ్లేగాల– తి.నరసిపుర ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది.
మృతులు వీరే
బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన బిళ్యాళ మంజునాథ్ (35), పూర్ణిమా (30), సుజాత (40), గాయత్రి (35), కొట్రేశ్ (45), కార్తీక్ (8), పవన్ (10), శ్రావ్య (3), సందీప్ (40), ఆదిత్య (26, ఇన్నోవా డ్రైవర్)లను మృతులుగా గుర్తించారు. ప్రమాదం తర్వాత ఏడు మంది అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. మంజునాథ్, కొట్రేశ్, సందీప్ అన్నదమ్ములని తెలిసింది. తీవ్రంగా గాయపడిన కారులోని జనార్ధన్ (40), శశికుమార్ (24), పునీత్ (4) అనే వ్యక్తులను మైసూరు కేఆర్ ఆస్పత్రికి, బస్సులో గాయపడిన 16 మంది ప్రయాణికులను తి.నరసీపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైలులో వచ్చి.. అద్దె కారు తీసుకుని
మే 27న బళ్లారి నుంచి రైలులో మైసూరుకు వచ్చిన వీరంతా చాముండిబెట్టకు వెళ్లి అక్కడ చాముండేశ్వరి దేవి దర్శనం చేసుకున్నారు. తరువాత పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని మైసూరులో ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు. కారులో మహదేశ్వర బెట్టకు, ఆపై బిళిగిరిరంగన బెట్టకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని మైసూరుకు తిరుగు పయనం అయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తి.నరసీపుర నుంచి కొళ్లేగాలకు ఎస్‌ఎంఆర్ ప్రైవేటు బస్సు ఎదురుగా వేగంగా వస్తోంది. ఎదురుగా ఇన్నోవా కారు కూడా అంతే వేగంగా వస్తోంది. ఈ క్రమంలో ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. మృతుల శరీర భాగాలు ముక్కలు తెగిపడడంతో అంతటా రక్తసిక్తమైంది.
బస్సు డ్యాష్ బోర్డులో దృశ్యాలు..
విషయం తెలిసిన వెంటనే స్థానికులు, సమీప గ్రామస్తులు, పోలీసులు చేరుకుని క్షతగాత్రులను బయటకు తీయడానికి శ్రమించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలను బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రైవేటు బస్సు డ్యాష్‌బోర్డులో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాల్లో ఇన్నోవా కారు డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడుపుతూ రావడం కనిపించింది. కారు డ్రైవర్ ఓవర్‌టేక్ చేస్తూ రాంగ్‌రూట్‌లో అతివేగంగా రావడం వల్ల బస్సును ఢీ కొన్నాడు.
కలెక్టర్, ఎస్పీ పరిశీలన
మైసూరు కలెక్టర్ కేవీ రాజేంద్ర, ఎస్పీ సీమా లట్కర్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కాగా, రోడ్డుకు అటు ఇటు దట్టంగా చెట్లు ఉండడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవనే ఫిర్యాదు ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు చెట్లను తొలగించలేదని స్థానికులు ఆరోపించారు. ఇదే ఇంతటి భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు చెరో రూ. 2 లక్షల పరిహారాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని అన్నారు.