బొమ్మనహళ్లి: బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా బస్సు చక్రాలు ఊడిపోయాయి. అదృష్టవశాత్తు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం కేఎ–53–డి–3397 నంబర్‌తో ఉన్న అశోక్ లేల్యాండ్ పాఠశాల బస్సులో సుమారు 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కింకుని ఇళ్ల వద్ద డ్రాప్ చేయడానికి బయల్దేరింది. కొంతసేపటికి బస్సు ఎడమవైపు వెనుక భాగంలోని రెండు టైర్లు బయటకు ఊడిపడ్డాయి. బస్సు పెద్ద శబ్ధంతో కుదుపులో లోను కావడంతో డ్రైవర్ నిలిపివేశాడు. ఏం జరిగిందోనని బాలలు ఆందోళనకు గురయ్యారు.
తల్లిదండ్రుల ఆగ్రహం
10 నుంచి 15 మంది మాత్రమే కూర్చోగలిగే బస్సులో సుమారు 20 మందికి పైగా చిన్నారులను తీసుకొని వెళ్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలకు ఏమైనా జరిగి ఉంటే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. బస్సులు ఫిట్‌నెస్‌తో ఉన్నాయా లేదా అని తనిఖీలు కూడా చేయకుండా రోడ్ల మీదకు వదలడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహించారు. పాఠశాలల యాజమాన్యం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. గంట తరువాత మరో బస్‌ను పిలిపించి విద్యార్థులను ఇళ్లకు చేర్చారు.
ప్రైవేటు స్కూళ్లంటే.. ఒకటో క్లాసు రెండో క్లాసులకు కూడా లక్షల కొద్దీ ఫీజులు కట్టాలి. ఫీజులు ఒక్కరోజు ఆలస్యమైనా సహించరు. పెన్నులు, పుస్తకాలు, షూ అన్నీ అదే స్కూల్లో రెట్టింపు రేట్లకు కొనాలి. నోరెత్తితే నో అడ్మిషన్ అంటారు. కానీ విద్యార్థుల భద్రత, వసతులు, బోధన వంటివి ఎంత నాసిరకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అటువంటిదే ఈ సంఘటన.
Comments
Please login to add a commentAdd a comment