కర్ణాటక: రెండు ఆటోలు– లారీ ఢీ కొన్న ప్రమాదంలో 7 మంది బంధువులు దుర్మరణం చెందారు. శుక్రవారం విజయనగర జిల్లా హొసపేట తాలూకా వడ్డరహళ్లి బ్రిడ్జి దగ్గర ఆటోలు – లారీ ఎదురుగా ఢీకొనగా ఒక ఆటో బ్రిడ్జి కిందకు పడిపోయింది. రెండు ఆటోల్లో 19 మంది ఉండగా,7 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర గాయాలైనాయి. మృతులంతా బళ్లారికి చెందిన వారు. టీబీ డ్యాం విహారయాత్రకు వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది.
వంతెన పైనుంచి కిందపడ్డ ఆటో
బళ్లారి కౌల్‌బజార్‌లోని గౌతం నగర్‌కు చెందిన సుమారు మూడు ముస్లిం కుటుంబాలు బక్రీద్ పండుగను సంతోషంగా ముగించుకుని మరుసటి రోజు కుటుంబ సభ్యులతో హొసపేట తుంగభద్ర డ్యాం వీక్షించడానికి ఆటోల్లో బయల్దేరారు. హొసపేట సమీపంలో వడ్డరహళ్లి వద్ద రైల్వే వంతెనపై ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను, లారీ ఢీకొట్టడంతో ఒక ఆటో వంతెన పై నుంచి కిందకు పడిపోయింది. వంతెన ఇరుకుగా ఉండగా, ఇక్కడ తరచూ చిన్నా చితకా ప్రమాదాలు జరుగుతుంటాయని, ఈసారి ఘోరం జరిగిపోయిందని స్థానికులు వాపోయారు.
మృతులు వీరే
యాస్మిన్ (45), సలీమా (40), ఉమేర్ (27), జాకీర్ (16), సఫ్రాబీ (55), కౌసర్‌బాను (35), ఇబ్రహీం (33) అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరికొందరు బాలలకు తీవ్ర గాయాలు తగిలాయి. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఐజీపీ, ఎస్పీ తనిఖీ
అనూహ్య దుర్ఘటనతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బళ్లారి ఐజీపీ లోకేష్, జిల్లా ఎస్‌పీ శ్రీహరి ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మంత్రి నాగేంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా, పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడినవారిని హొసపేట, బళ్లారి విమ్స్ ఆస్పత్రులకు తరలించారు. హొసపేట గ్రామీణ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment