రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీ, ఢీకొని ధ్వంసమైన కారు
సాక్షి బళ్లారి/ తుమకూరు: రోడ్డు పక్కన నిలబడి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న దుర్ఘటనలో కారుడ్రైవర్, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు, ఈ దుర్ఘటన చిత్రదుర్గ జిల్లా మల్ళాపుర గొల్ళరహట్టి దగ్గర సోమవారం ఉదయం 7:45 గంటలకు జరిగింది. మృతులు తుమకూరు నగరానికి చెందిన ఖలీల్ (42), భార్య మల్లిక (37), కుమార్తె తబ్రేజ్ (13), కారు డ్రైవర్ షంషుద్దీన్ (40). ఖలీల్ పిల్లలు నర్గీష్, రెహాన్, రెహమాన్‌లు తీవ్రంగా గాయపడటంతో వారిని చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారును వేగంగా నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తు వల్ల అదుపు తప్పడమే యాక్సిడెంట్‌కు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
ఇల్లు చూసుకుని వస్తుండగా
వివరాలు.. తుమకూరులో నివసించే ఖలీల్– మల్లిక దంపతులకు నలుగురు పిల్లలు. రెండురోజుల కిందట బెళగావిలో కొత్తగా కడుతున్న ఇంటి పనుల్ని చూడడానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం బాడుగ కారులో తుమకూరుకు బయల్దేరారు. జాతీయ రహదారి– 48లో రోడ్డుపక్కన నిలబడి ఉన్న లారీని వీరి కారు ఢీకొని దాని కిందకు దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జు కాగా నలుగురు అక్కడే మృత్యువాత పడ్డారు. రూరల్ పోలీసులు చేరుకుని సహాయకచర్యలు చేపట్టి బాధితులు, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment