
ఈయన పేరు విశ్వనాథ్ అని, ఆర్‌ఎస్‌ఎస్‌లో పలుకుబడి ఉందని, టికెట్ ఇప్పిస్తారని చెప్పింది. అనంతరం మూడు విడతలుగా రూ.5కోట్ల నగదు తీసుకుంది.
కర్ణాటక: బీజేపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని పారిశ్రామిక వేత్తనుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలపై సామాజిక కార్యకర్త చైత్రా కుందాపురతో సహా ఆరుగురిని బుధవారం సీసీబీ పోలీసులు అరెస్ట్‌చేశారు. అదనపు పోలీస్‌కమిషనర్ సతీశ్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
గత శాసనసభ ఎన్నికల సమయంలో బైందూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పారిశ్రామికవేత్త గోవిందబాబుపూజారి ఆసక్తితో ఉన్నాడు. ఆ సమయంలోనే చైత్రాకుందాపురతో పరిచయమైంది. ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో, పీఎంఓలో తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పింది. చిక్కమగళూరుకు గోవిందబాబు పూజారిని తీసుకెళ్లి ఓ వ్యక్తిని పరిచయం చేసింది.
ఈయన పేరు విశ్వనాథ్ అని, ఆర్‌ఎస్‌ఎస్‌లో పలుకుబడి ఉందని, టికెట్ ఇప్పిస్తారని చెప్పింది. అనంతరం మూడు విడతలుగా రూ.5కోట్ల నగదు తీసుకుంది. మార్చి 8న ఓ వ్యక్తి పారిశ్రామికవేత్తకు ఫోన్ చేసి విశ్వనాథ్ మృతిచెందారని తెలిపారు. అనుమానం వచ్చి కశ్మీరులో ఉన్న స్నేహితుడు విశ్రాంత ఆర్మీ అధికారి యోగేశ్‌కు ఫోన్ చేయగా విశ్వనాథ్ ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎవరూలేరని తెలిపారు.
చైత్రాకుందాపురకు ఫోన్ చేసి తన డబ్బు వెనక్కి ఇవ్వాలని కోరగా ఆత్మహత్యాయత్నం నాటకం ఆడింది. కొంత సమయం కావాలని అడిగింది. అనుమానం రావడంతో చైత్రాకుందాపుర, గగన్‌కడూరు, అభినవ హాలశ్రీస్వామీజీ, రమేశ్, ధనరాజ్, నాయక్, శ్రీకాంత్, ప్రసాద్‌బైందూరుపై బండెపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీబీ పోలీసులు తీవ్రంగా గాలించి చైత్రా కుందాపుర, గగన్ కడూరు, శ్రీకాంత్‌నాయక్, ప్రసాద్, మరో ఇద్దరిని అరెస్ట్‌చేసి ఉడుపి నుంచి బెంగళూరు నగరానికి తరలించారు. బెంగళూరు నగర ఒకటో ఏసీఎంఎం కోర్టులో హాజరు పరిచి మరింత విచారణ కోసం ఈనెల 23 తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు.
అజ్ఞాతంలోకి స్వామీజీ?
మూడో నిందితుడిగా తనపై కేసు నమోదైనట్లు తెలియడంతో విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకా హిరేహడగలి హాలుమత అభినవ హాలశ్రీ స్వామీజీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.