కెజీఎఫ్: కోలారు జిల్లాలోని కేజీఎఫ్ పట్టణం బంగారు గనులకు, హిట్ సినిమా కథలకే కాదు, మరికొన్ని ఘనతలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఐఆర్‌ఎం సంస్థనే అయోధ్యలోని ప్రఖ్యాత రామమందిరం నిర్మాణానికి ఉపయోగించిన బండరాళ్లు, శిలల నాణ్యతను పరిశీలించి విలువైన సూచనలు అందజేసింది. అయోధ్య ఆలయ శిలల నాణ్యతను తనిఖీ చేసే బాధ్యతను నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్‌ఐఆర్‌ఎం) సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా కేజీఎఫ్ సిగలో మరో కలికితురాయి చేరింది.
2021లో తనిఖీ బాధ్యతలు
రామమందిరం ఎలాంటి లోహాలను, సిమెంటు వంటివి ఉపయోగించకుండా రాతితో నిర్మిస్తుండడం విశేషం. భూకంపాలు, ఉరుములు, మెరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే విధంగా నిర్మాణం సాగుతోంది. ఇంత పెద్ద ఆలయ నిర్మాణానికి రాళ్లు చాలా ముఖ్యం. వాటి నాణ్యత కూడా బాగుండాలి. దశాబ్దాల తరబడి మన్నిక ఉండాలంటే శాసీ్త్రయంగా పరిశోధించి మంచి రాళ్లను ఎంపిక చేయాలి. అందుకోసం రామజన్మభూమి ట్రస్టు.. దేశంలోని పలు నిర్మాణ రంగ సంస్థలను సంప్రదించి చివరకు కేజీఎఫ్‌లోని ఎన్‌ఐఆర్‌ఎంకు 2021లో బాధ్యతను అప్పగించింది.
మూడు రకాల రాళ్లు
ఎన్‌ఐఆర్‌ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్– హెచ్‌ఓడి ఎ.రాజన్‌బాబు రాళ్ల పరీక్షలకు నేతృత్వం వహించారు. ఈయన స్వయంగా కేజీఎఫ్ వాస్తవ్యులే కావడం విశేషం. ఎన్‌ఐఆర్‌ఎం నిపుణులు రాయ్‌స్టన్ ఏంజలో విక్టర్, డి ప్రశాంత్ కుమార్‌లు, టెక్నీషియన్లు ఆర్. ప్రభు, బాబు.ఎస్‌లు ఈ బృందంలో ఉన్నారు. మందిరంలో ముఖ్యంగా మూడు రకాల రాళ్లను ఉపయోగించారు. పునాదికి గ్రానైట్ రకం రాళ్లు, సూపర్ స్ట్రైకర్ రాళ్లను నిలువు, అడ్డు స్తంభాలుగా, డెకోరేటివ్ రాళ్లు అలంకారానికి అని రాజన్‌బాబు తెలిపారు.
లక్షకు పైగా రాళ్ల పరీక్ష
► ఎన్‌ఐఆర్‌ఎం ఎలాంటి రాళ్లనైనా పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది. మందిర నిర్మాణానికి వివిధ రకాల సుమారు లక్షకు పైగా రాళ్లను పరీక్షించారు.
► ఇందుకోసం కేజీఎఫ్‌లోని సంస్థలోను, అలాగే అయోధ్య ఆలయంలో నిపుణులు నిరంతరం పనిచేశారు.
► అంతిమంగా ఎంపిక చేసిన రాళ్లనే ఇంజినీర్లు నిర్మాణంలో ఉపయోగించారు.
► వేయి సంవత్సరాలు నిలిచే నాణ్యత కలిగిన రాళ్లను రామమందిర నిర్మాణానికి సిఫారసు చేయడం జరిగింది.
► ఇందులో గ్రానైట్ రాళ్లను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల నుంచి సేకరించారు.
► ఈ రాళ్ల పరీక్షల కోసం సుమారు రూ. 8.24 కోట్లను ఖర్చు చేశారు.
► కర్ణాటకలోని సాదహళ్లి, దేవనహళ్లి, చిక్కబళ్లాపురం, తుమకూరు, శిర ప్రాంతాలలోని రాళ్లను పరిశీలించి కట్టడానికి ఆమోదించారు.
► తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, ఏపీలో ఒంగోలు ప్రాంతాలనుంచి రాళ్ల నమూనాలను కేజీఎఫ్‌కు తెప్పించుకుని వాటిని ఉపయోగించవచ్చని సిఫార్సు చేశారు
మా అదృష్టం: రాజన్‌బాబు
దేశం గర్వించదగిన ఆధునిక యుగంలో రామమందిర నిర్మాణం అనేది అద్భుత ఘట్టం. రాళ్లను పరీక్షించే మహత్తర కార్యంలో మేము పాల్గొనడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇది మాకు దక్కిన అదృష్టం. పరీక్షా కార్యంలో పాల్గొన్న అధికారుల నుంచి మొదలుకుని కూలి కార్మికుల వరకు అందరూ సిగరెట్, మద్యం వంటివాటికి దూరంగా ఉన్నారు. క్రమశిక్షణ, శ్రద్ధా భక్తులతో పనుల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment