జనార్దనరెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం | - | Sakshi
Sakshi News home page

జనార్దనరెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం

Published Wed, Jan 31 2024 1:12 AM | Last Updated on Wed, Jan 31 2024 10:50 AM

- - Sakshi

సాక్షి, బళ్లారి: మాజీ మంత్రి, కేఆర్‌పీపీ అధినేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తిరిగి బీజేపీలోకి వస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని, స్వాగతిస్తామని ఆయన సోదరుడు, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన సోదరుడు బీజేపీలోకి వస్తే త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా బళ్లారి లోక్‌సభ సీటు గెలవడం ఖాయమన్నారు.

బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఆయన లేకపోతే జిల్లాలో బీజేపీ లేదనే మాటల్లో నిజం లేదన్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదనే విషయం అనేక సందర్భాల్లో రుజువైందన్నారు. కేఆర్‌పీపీ వల్ల తాను, మాజీ మంత్రి శ్రీరాములు ఓడిపోయామనడంలో కూడా వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్‌ ఐదు గ్యారెంటీల వల్ల పరాజయం ఎదురైందన్నారు. గెలుపు ఓటములు ప్రజల చేతుల్లో ఉంటాయని, వారి అభిప్రాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందేనన్నారు.

గాలి జనార్దనరెడ్డిది మాస్టర్‌ మైండ్‌, మాజీ మంత్రి శ్రీరాములు ప్రజల మనిషి అని, వీరిద్దరి కలయికతో ఈ ప్రాంతంలో బీజేపీ బలపడేందుకు దోహదపడతుందన్నారు. ఐకమత్యంతోనే మహాబలం అని అనాది కాలంగా నిరూపితం అయిందని, శాసనసభలో మంత్రిగా ముందు వరుసలో కూర్చోవాల్సిన ఆయన ఒకే ఒక్కడుగా గెలిచి వెనుక వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రంలో హ్యాట్రిక్‌ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement