మైసూరు: పెన్‌డ్రైవ్ పంపిణీ వెనుక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, డ్రైవర్ కార్తీక్, నవీన్‌గౌడ తదితరుల ముఖ్య పాత్ర ఉందని, వారిని సిట్ విచారించాలని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. బుధవారం మైసూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ తానేమీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతుగా నిలవడం లేదన్నారు. అతడు తప్పు చేసి ఉంటే శిక్ష విధించాలని చెప్పారు. దేవరాజేగౌడ, శివరామేగౌడ, డీకే శివకుమార్‌లు పెన్‌డ్రైవ్ పంపిణీ వెనుక ఉన్నారని పేర్కొన్నారు.
8 మంది పోలీసుల రక్షణలో కార్తీక్ ఉన్నాడని, అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసు వల్ల మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం పరువు కొంతమేర దెబ్బతిన్నట్లు చెప్పారు. దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయకుండా వదలనని డీకే శివకుమార్ చెప్పడం బట్టి ఆయన కుట్ర ఉందనే అనుమానాలు వస్తున్నాయన్నారు. డీకే అంటే తనకు ఎలాంటి అసూయ లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో వీడియో విడుదల చేశారు. వీడియో తయారు చేసినదానికంటే దాని పంపిణీ చేయడమే పెద్ద నేరమని చెప్పారు.
ప్రజ్వల్ తనతో మాట్లాడేవాడు కాదని, ఇప్పడు హెచ్‌డీ రేవణ్ణ కాంటాక్టులో లేడని చెప్పారు. ప్రస్తుతం తాను విదేశాలకు వెళ్లాలంటే కూడా భయంగా ఉందని, ప్రజ్వల్‌ను రక్షించేందుకు వెళ్లారని ప్రచారం చేస్తారన్నారు. విశ్వసనీయత, నైతికతను కాపాడుకునేందుకు ప్రజ్వల్ దేశానికి తిరిగి రావాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment