
త్వరలో బళ్లారికి రానున్న ఐటీ బృందం
రూ. 30 లక్షలపై ప్రశ్నలు
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రముఖ సినీ నటుడు దర్శన్ బళ్లారి జైల్లో ఖైదులో ఉన్నారు. ఆయన మరో విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. హత్యను కప్పిపుచ్చేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆధారాలు బయటకు రావడంతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దర్శన్‌ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బళ్లారి జైలులో దర్శన్‌ను కలిసిన ఆయన న్యాయవాది త్వరలో బెయిల్ లభిస్తుందని సూచనలిచ్చారు.
ఇంతలో ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోర్టు నుంచి సెంట్రల్ జైలు అధికారులకు ఈ–మెయిల్ వచ్చింది. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు దర్శన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రేణుకాచార్య హత్య తరువాత మృతదేహం తరలింపు, ఆ నేరాన్ని ఇతరులు వేసుకోవాలని రూ. 30 లక్షలకు పైగా నగదును దర్శన్ కొందరు నిందితులకు ఇచ్చినట్లు, ఆ నగదును ఓ నిందితుని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో నగదు గురించి ఐటీ అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని సిద్ధమయ్యారు.