చరిత్రకు సాక్ష్యం.. జఠంగి ఆలయం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పవిత్ర పుణ్యక్షేత్రాలెన్నో భాసిల్లుతున్నాయి. మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శివునికి అత్యంత అగ్రస్థానం ఉంది. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు దేశంలో ఎన్నో ప్రాంతాల్లో స్వయంగా శివలింగాలను ప్రతిష్టాపన చేసి పూజలు చేసిన సందర్భాలు, అందుకు సంబంధించిన చరిత్ర ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అలాంటి ఎంతో ఘనమైన చరిత్ర జఠంగి రామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా ఉంది. శివుడిని భక్తులు ఎంతో నియమనిష్టలతో సేవించి శివాలయాలను సందర్శించేందుకు ఇష్టపడేది మాఘ మాసం, కార్తీక మాసాల్లోనే. ఈ రెండు మాసాలు శివున్ని శివభక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆ సమయంలో మహిమాన్విత ఆలయాలను సందర్శించి పునీతులవుతుంటారు. ప్రస్తుతం మాఘ మాసంలో శివాలయాలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్టాపన చేసిన శివలింగమే శ్రీ జఠంగి రామలింగేశ్వర ఆలయం. ఈ ప్రాంతంలో ఉండటంతో భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో కొలుస్తూ శివుడిని ఆరాధిస్తున్నారు.
రామేశ్వరాలయానికి చారిత్రక నేపథ్యం
చారిత్రాత్మకమైన, మహిమాన్విత స్థలాలు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రదుర్గ, బళ్లారి జిల్లాల్లో శ్రీరాముడు ఈ ప్రాంతాలకు వచ్చినట్లు చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయి. రామాయణ కథకు నిదర్శనంగా నిలిచే అపురూపమైన దృశ్యాలు, గుట్టలు, పర్వతాలు చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకా రామసాగర గ్రామంలో కొలువుదీరాయి. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న బళ్లారికి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని రాంపుర గ్రామ సమీపంలోని జఠంగి రామేశ్వర ఆలయానికి చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉంది. ఈ గుట్ట(పర్వతానికి)కు రామ, లక్ష్మణ, సీతతో పాటు రావణాసురుడు వచ్చినట్లు కూడా చరిత్ర చెబుతోంది. రామాయణ పురాణ పుణ్య కథల వల్ల తేటతెల్లం అవుతున్న ఈ విశేష కథనం రామసాగర వద్ద జఠంగి రామేశ్వర కొండ సాక్షిగా నిలుస్తోంది. సముద్రం మట్టం నుంచి 3469 అడుగులు ఎత్తులో రెండు భారీ ఆకారపు కొండలు ఉన్నాయి. ఈ కొండలకు వందలాది సంవత్సరాల నుంచి జఠాయు పర్వతాలు అని పిలుచుకుంటారు. ఒక కొండ చివరి భాగంలో వేలాది సంవత్సరాల క్రితం నాటి సమాధి ఉంది. దీనిని జఠాయువు సమాధి అని పిలుస్తారు.
గుహాకారంలో వెలసిన ఆలయం
ఈ సమాధి కింద గుహాకారంలో రామేశ్వర ఆలయం ఉంది. జఠాయువు సమాధి ఉన్న కొండ ఎదురుగా మరో కొండలో 108 లింగాలు వెలిశాయి. జఠంగి రామేశ్వర ఆలయం కూడా ఉంది. జఠాయువు కోరిక మేరకు శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్టాపించి ప్రాణప్రతిష్టాపన చేసినట్లుగా విశ్వసిస్తారు. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకు రావడానికి శ్రీరాముడు భక్తుడు ఆంజనేయుడికి సూచిస్తారు. అయితే ఆంజనేయుడు శివలింగం తీసుకుని రావడానికి ఆలస్యం జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతంలో లభ్యమైన ఉద్బవలింగానికి శ్రీరాముడు ప్రాణప్రతిష్టాపన చేస్తారు. ఈ క్రమంలో ఆంజనేయుడు తీసుకుని వచ్చిన లింగాన్ని ప్రతిష్టించిన తర్వాత 108 లింగాలు కూడా ప్రతిష్టాపించినట్లుగా ఇక్కడ ప్రతీతి. దేవాలయంలో నంది విగ్రహం ఎదురుగా భారీ ఆకారంలో దీపస్తంభం ఉండగా, శిలలతో నిర్మాణమైన అపురూపమైన దేవాలయం ఉంది. అలాగే చుట్టు పక్కల పలు దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో జఠంగి రామేశ్వర కొండకు విశేషంగా భక్తులు తరలివచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.
భక్తుల కొంగుబంగారం
రామలింగేశ్వర స్వామి
శ్రీరాముడు ప్రతిష్టించిన
శివలింగమే మూలవిరాట్
సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నడయాడిన స్థలం
చరిత్రకు సాక్ష్యం.. జఠంగి ఆలయం
చరిత్రకు సాక్ష్యం.. జఠంగి ఆలయం
చరిత్రకు సాక్ష్యం.. జఠంగి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment