జాతరకు వెళుతుండగా బోలెరో ఢీ
బొమ్మనహాళ్: కర్ణాటకలోని బళ్లారి తాలూకా సంగనకల్లు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్ధులు తెలిపిన వివరాల మేరకు.. నేమకల్లు గ్రామానికి చెందిన తిప్పేస్వామి, రత్నమ్మ దంపతుల కుమారుడు జి.నాగరాజు (19), వన్నూర, వనజాక్షి దంపతుల కుమారుడు కె.గణేష్(14) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ జీవనం సాగించేవారు. గ్రామం నుంచి సోమవారం సాయంత్రం జి.నాగరాజు, కె.గణేష్‌తో పాటు మరి కొంతమంది యువకులు కాలినడకన కర్ణాటకలోని గూళ్యం గ్రామంలో వెలసిన శ్రీగాదిలింగేశ్వర జాతరకు బయలుదేరారు. రాత్రి 9.30 గంటల సమయంలో కప్పగల్–సిరివార క్రాస్ వద్ద రోడ్డు పక్కన నడుచుకొంటూ వెళుతున్నారు.
వెనుక నుంచి ఢీకొన్న బోలెరో
వెనుక వైపు నుంచి వచ్చిన బొలెరో (కేఎ–34 సి–9845) నాగరాజు, గణేష్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నాగరాజు, గణేష్‌లను తోటి గ్రామస్ధులు బళ్లారి విమ్స్‌కు అంబులెన్సులో తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. మంగళవారం నాగరాజు, గణేష్‌ల మృతదేహాలకు విమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను నేమకల్లు గ్రామానికి తీసుకొచ్చారు. మృతదేహాల వద్ద తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల రోదనలు అక్కడికి వచ్చిన వారందర్నీ కంటతడి పెట్టించింది. వైఎస్సార్‌సీపీ సర్పంచ్ పరమేశ్వర కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నేమకల్లు యువకుల మృతి
గ్రామంలో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment