‘దళితుల నిధులను దారి మళ్లించిన సర్కార్’
కోలారు : దళితుల అభ్యున్నతికి రిజర్వు చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించి గ్యారెంటీ పథకాల అమలుకు వినియోగిస్తోందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నిధుల దారి మళ్లింపును నిరసిస్తూ మాజీ ఎంపీ మునిస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చలపతి నేతృత్వంలో మంగళవారం నగరంలోని మెక్కె సర్కిల్ నుంచి ఊరేగింపుగా బస్టాండ్ వద్దకు చేరుకొని పంగనామాలు వేసిన చెంబులను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ సిద్దరామ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను సక్రమంగా అమలు చేయలేక చతికిలబడిందన్నారు. దళితుల కోసం కేటాయించిన రూ. 34 వేల కోట్లను దారి మళ్లించి గ్యారంటీల కోసం ఖర్చు చేశారన్నారు. దళితుల పేరుతో అధికారంలోకి వచ్చి వారికే మోసం చేసిందన్నారు. మాజీ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల నిధులను లూటీ చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయడం లేదన్నారు. 60 శాతం కమీషన్ డిమాండ్ చేస్తుండడం శోచనీయమన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వై సంపంగి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment