హుబ్లీ: అంగన్‌వాడీ పిల్లలు, బాలింతలు, గర్భిణులకు పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారం కిట్లను అక్రమంగా నిలువ చేసిన ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుబ్లీ ధార్వాడ తూర్పు అసెంబ్లీ క్షేత్రం బీజేపీ మహిళా మోర్ఛా కార్యకర్తలు దుర్గదబైలు సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పోలీస్ శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్, ఆ పార్టీ నేత శివు మెణసినకాయి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, మహిళలకు అందజేయాల్సిన పౌష్టికాహారం సరుకులను అక్రమంగా సేకరించడమే కాకుండా నల్లబజార్‌లో వాటిని విక్రయించిన కాంగ్రెస్ కార్యకర్త బతుల్ కిల్లేదారను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఒత్తిడి చేశారు. మహిళా మోర్ఛా అధ్యక్షురాలు ప్రతిభ పవార్, మంజునాథ్ కాటకర, పూజా రాయకర్, పూర్ణిమా, అనురాధ, లక్ష్మీకాంత ఘోడ్ఖే తదితరులు పాల్గొన్నారు.
కేఎస్ ఆర్టీసీ కార్యాలయంలో కేరళ అధికారులు
దొడ్డబళ్లాపురం: కేరళ ఆర్టీసీ సంస్థ అధ్యక్షుడు, ఎండీ, అధికార బృందం బుధవారం బెంగళూరులోని కేఎస్‌ఆర్టీసీ సంస్థ కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, వాటి లాభాలు, ఆదాయం, లాభాలు తదితర అంశాలపై తెలుసుకున్నారు. అనంతరం కేఎస్‌ఆర్టీసీ 2యూనిట్‌ను సందర్శించి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, వాటి పనితీరు,లగ్జరీ బస్సులు పరిశీలించారు.
చెరువులో వ్యక్తి మృతదేహం
తుమకూరు: తల, చేతులు లేని కుళ్లిన మృతదేహం బుధవారం శిరా దొడ్డకెరెలో తేలుతూ కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతుడికి 35 ఏళ్ల వయస్సుంటుందని నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎవరో చంపేసి మృతదేహాన్ని నీటిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment