హుబ్లీ: సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి సిద్దరామయ్య ఈనెల 7న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సీఎం ప్రతిపాదించే 16వ రికార్డు స్థాయి బడ్జెట్‌పై వాణిజ్య నగరి హుబ్లీ, ధార్వాడ జిల్లా ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని వ్యవసాయం, పరిశ్రమలు, కనీస వసతుల కల్పనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎంను డిమాండ్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర బలిగేర మాట్లాడుతూ హుబ్లీ ధార్వాడల మధ్య ప్రారంభమైన వివిధోద్దేశ ప్రదర్శన కేంద్రానికి రూ.2 కోట్ల ప్రత్యేక నిధులను కోరామన్నారు. ఎస్‌ఎంసీబీ. క్లస్టర్‌కు స్థలం మంజూరు చేశారు. అయితే ఒక ఎకరాకు రూ.98 లక్షల నుంచి రూ.కోటికి పెంచారు. ఈ బడ్జెట్‌లో ధర తగ్గించాలని డిమాండ్ చేశారు. జంట నగరాల మధ్య సంచరించే బీఆర్‌టీఎస్ సంస్థ చివరి దశలో ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా, మోనో రైలు, ట్రాన్స్ మెట్రో చేయడానికి బడ్జెట్ నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. టెక్స్‌టైల్ పార్క్‌కు తగిన నిధులు కేటాయిస్తూ స్టార్టప్ కంపెనీలకు ఎక్కువగా ప్రోత్సాహం అందించాలన్నారు.
వ్యవసాయ పరికరాల కర్మాగారానికి సబ్సిడీ ఇవ్వాలి
వ్యవసాయ ఆధారిత పరికరాల ఫ్యాక్టరీ స్థాపనకు సబ్సిడీ ఇవ్వాలి, ట్రక్ టర్మినల్ స్థలం కేటాయించారని, అందులో మెకానికల్, ఆటోమొబైల్‌కు అవకాశం కల్పించాలన్నారు. జంట నగరాల ప్రజలకు కనీస సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్లు ప్రత్యేకం కావడం వల్ల ఈ రెండు కార్పొరేషన్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. దీంతో ఈ రెండు పాలికెలు అభివృద్ధికి అవకాశం ఉంటుందని రవీంద్ర బలిగేర అభిప్రాయ పడ్డారు. ఇప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకున్న వాటిని ఈ బడ్జెట్‌లో నెరవేర్చాలని కోరారు. ఉత్తర కర్ణాటక పర్యాటక శాఖ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. రాష్ట్ర అభివృద్ధి ఔద్యోగీకరణ చాలా అవసరం అన్నారు. బెంగళూరు తర్వాత అతివేగంగా హుబ్లీ ధార్వాడలు పెరుగుతున్నాయి. వీటికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి తగిన పరిశ్రమలు స్థాపించాలి. ముఖ్యంగా బెంగళూరు, మైసూరులకు ఇచ్చే ప్రాధాన్యతకు జంట నగరాలకు కూడా ఇవ్వాలని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో సిద్దూను డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment