కారు బోల్తా... ఐదుగురికి గాయాలు
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని టోల్‌గేట్ దగ్గర కారు బోల్తా పడిన ఘటన గురువారం జరిగింది. ఓ ఇంట్లో అర్చకులు విధులు నిర్వహించి కారులో తమ స్వగ్రామానికి తిరిగి వెళుతున్న సమయంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు పూజారులు, సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈఘటనలో డ్రైవర్‌తో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సింధనూరు ఆస్పత్రిలో చేర్పించారు.
ఎడమ కాలువకు
ఏప్రిల్ వరకు నీరందించండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్ర పాటిల్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆయన ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఎడమ కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికందకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిర్వహణలో గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టులో చివరి భూములకు ఏప్రిల్ వరకు నీరందివ్వాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.
గ్రామ పంచాయతీ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం
శ్రీనివాసపురం : తాలూకాలోని రోణూరు గ్రామ పంచాయతీ నూతన అధ్యక్షురాలిగా ఆర్ ప్రమీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బుధవారం ఎన్నిక జరిగింది. ప్రమీలమ్మ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కేసీ మంజునాథ్ ప్రకటించారు. నూతన అధ్యక్షురాలు మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తానని తెలిపారు.
సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం
కోలారు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోలారు నగరంలోని పీసీ కాలనీలో ఉన్న తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న 45 మంది మహిళా సిబ్బందిని బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం బ్యాడ్మింటన్, చెస్ పోటీలు నిర్వహించి విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సూపరింటెండెంట్ వీఎస్‌ఎల్ నరసింహరావ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, వారిని తగిన విధంగా గౌరవించాల్సి ఉందన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పర్యటన
కోలారు : కోలారు జిల్లాలో కేసీ వ్యాలీ నీరు ప్రవహించే తాలూకాలోని సుగటూరు ఫిర్కా తూరాండహళ్లి గ్రామాన్ని కేంద్ర మాలిన్య నియంత్రణ మండలి ప్రాంతీయ డైరెక్టర్ జె చంద్రబాబు, రాష్ట్ర పరిసర నియంత్రణ మండలి అధికారి రాజులు గురువారం సందర్శించారు. టీఎన్ రవి అనే రైతులకు చెందిన తోటలో సాగులో ఉన్న టమాట, బీన్స్, క్యాప్సికం, వంకాయ, క్యారెట్ పంట ఉత్పత్తులను సేకరించారు. ల్యాబ్‌లో పరిశీలన జరిపిన అనంతరం నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు. ప్రాధ్యాపకురాలు డాక్టర్ బీజీ వాసంతి, చిన్న నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ శశికుమార్, సుగటూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు భూపతి గౌడ, ప్రగతిపర రైతు రవి పాల్గొన్నారు.
కారు బోల్తా... ఐదుగురికి గాయాలు
కారు బోల్తా... ఐదుగురికి గాయాలు
కారు బోల్తా... ఐదుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment