జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడిగా యంకప్ప
రాయచూరు రూరల్: జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల(పీఈటీ) సంఘం అధ్యక్షుడిగా యంకప్ప ఫిరంగి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం ఎన్నికల అధికారి కృష్ణకు నామినేషన్ అందించారు. వేరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. కాగా మూడోసారి జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడిగా యంకప్ప ఎంపిక కావడం గమనార్హం.
గ్యారెంటీలకు ఆ నిధుల మళ్లింపు తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి పథకాలకు కేటాయించిన నిధులను పంచ గ్యారెంటీలకు వ్యయం చేయడం తగదని రాయచూరు జిల్లా జేడీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గురువారం అంబేడ్కర్ సర్కిల్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విరుపాక్షి ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎస్సీ, ఎస్పీ, టీఎస్పీలో దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.39,121 కోట్లలో రూ.21,746 కోట్ల నిధులను వినియోగించారన్నారు. దళితుల అభివృద్ధి పేరుతో గృహలక్ష్మి పథకానికి రూ.7,882 కోట్లు వాడుకున్నారన్నారు. అనంతరం స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మాజీ శాసన సభ్యులు వెంకట్రావ్ నాడగౌడ, రాజా వెంకటప్ప నాయక్, నేతలు శివశంకర్, మహంతేష్ పాటిల్, నరసింహ నాయక్, తిమ్మారెడ్డి, లక్ష్మిపతి, బుడ్డనగౌడ, బాబుదిన్ని, నరసప్పలున్నారు.
గడ్డివాములకు నిప్పు..
రూ.2 లక్షల నష్టం
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు పట్టణంలో 15 గడ్డివాములకు నిప్పుంటుకున్న ఘటన గురువారం జరిగింది. ఆ పట్టణంలోని గోళిపేటలో పశువుల కోసం గడ్డివాములుగా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డి వాములకు నిప్పుంటుకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడానికి పలు ఇబ్బందులు పడ్డారు. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం అందించారు.
పీయూ పరీక్షలకు 95.63 శాతం విద్యార్థుల హాజరు
హుబ్లీ: జిల్లాలో బుధవారం జరిగిన ద్వితీయ పీయూసీ రాజనీతి శాస్త్రం పరీక్షకు మొత్తం 7243 విద్యార్థులు నమోదు చేసుకోగా 6927 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 306 మంది గైర్హాజరయ్యారు. మొత్తం నమోదు చేసుకొన్న విద్యార్థుల్లో 95.63 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు పీయూ శాఖ డీడీ సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. సంఖ్యాశాస్త్రం పరీక్షకు 4709 మంది విద్యార్థులకు గాను 4610 మంది పరీక్షలు రాశారు. 99 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. మొత్తం నమోదు చేసుకొన్న విద్యార్థుల్లో 97.89 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఆయన ఓ ప్రకటనలో వివరించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు మృతి
హొసపేటె: నగర శివార్లలోని జాతీయ రహదారిపై హొసపేటెలోకి ప్రవేశ సొరంగ మార్గంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు స్థలంలోనే మృతి చెందాడు. కొప్పళకు చెందిన హెచ్‌ఎం.కొట్రేష్(30) అనే యువకుడు టీవీఎస్ ఎక్సెల్ బైక్‌పై మరియమ్మనహళ్లి నుంచి తిరిగి తాను ఉంటున్న ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గంమధ్యలో ఎన్.హెచ్–50పై గుర్తు తెలియని వాహనాన్ని డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు హొసపేటె ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొన్నారు. ప్రమాదానికి కారకుడైన వాహనం డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడిగా యంకప్ప
జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడిగా యంకప్ప
Comments
Please login to add a commentAdd a comment