సిద్దు బడ్జెట్‌పై గంపెడాశలు
హుబ్లీ: హుబ్లీలోని కర్ణాటక వైద్య కళాశాల(కిమ్స్) పరిశోధన సంస్థ ఉత్తర కర్ణాటకలోని పేద, మధ్య తరగతి ప్రజల పాలిట ఆరోగ్య సంజీవిని. ఏడెనిమిది జిల్లాల రోగులు మెరుగైన చికిత్స కోసం ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తారు. అయినా ప్రభుత్వం నుంచి మాత్రం అంతగా నిధులు రావడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. శుక్రవారం నాటి రాష్ట్ర బడ్జెట్‌పై అందరూ ఆశలు పెట్టుకొన్నారు. ఆమేరకు కేఎంసీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఎస్‌ఎఫ్ కమ్మార మాట్లాడుతూ రూ.515 కోట్లను అవసరమైన పనులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు పలు పథకాలకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.417 కోట్లకు ప్రతిపాదించగా రూ.233 కోట్లు ఇచ్చారన్నారు. ఈసారి కూడా ఎక్కువ నిధులు కేటాయిస్తారన్న ఆశలు పెట్టుకొన్నారు. ఆస్పత్రి వైద్య సిబ్బందికి ప్రతి ఏటా సుమారు రూ.150 కోట్ల వేతనాలు చెల్లించాలి. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.515 కోట్ల నిధులను కేటాయిస్తే బాగుంటుందని డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.
మంత్రికి డిమాండ్లపై ఏకరువు
వైద్య విద్యా మంత్రికి ప్రగతి పరిశీలన సమావేశంలో కూడా ఇక్కడి డిమాండ్లను ఏకరువు పెట్టామన్నారు. ఆమేరకు 200 పడకల ప్రాంతీయ క్యాన్సర్ కేర్ సెంటర్, లెవల్–2 ట్రామా కేర్ సెంటర్, ప్రత్యేక ఫ్యారా మెడికల్ కాలేజ్, అంతర్గత రోడ్ల నిర్మాణం. వసతి నిలయాల్లో జలనిరోధక, యూజీడీ లైన్ ఆధునీకరణ, 750 కేవీఏ జనరేటర్ అవసరం, కేంద్ర గ్రంథాలయ మరమ్మతులు, ఆధునీకరణ, ఆదర్శ విశ్రాంతి గృహ నిర్మాణం, అత్యాధునిక ఉపహార కేంద్రం, 3 టెస్లా ఎంఆర్‌ఐ యంత్రం, 160 సీటీ స్కాన్ యంత్రం, 240 పడకల మూత్ర పిండం, మూత్రకోశాల విభాగం అభివృద్ధి, చిన్నపిల్లల ఆస్పత్రి, 4, 5వ అంతస్తుల కట్టడ నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాధించామన్నారు. మొత్తం ఎనిమిది జిల్లాల రోగులు చికిత్సలకు వస్తారు. రోజూ 3 వేల మంది బయట రోగులుగా నమోదు అవుతున్నారు. 1000కి పైగా లోపల రోగులున్నారు. మరింత అభివృద్ది పనులు చేపట్టడానికి తగినన్ని నిధుల కేటాయింపునకు ఆస్పత్రి రోగులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment