అవినీతిపై లోకాయుక్త పంజా
బనశంకరి: అవినీతి అధికారులపై లోకాయుక్త పంజా విసిరింది. గురువారం వేకువ జామున బెంగళూరు నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఒకేసారి 8 మంది అవినీతి అధికారులపై దాడి చేసి కోట్లాది రూపాయల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, కోలారు, కలబురిగి, దావణగెరె, విజయపుర, తుమకూరు, బాగల్‌కోటెతో పాటు 7 జిల్లాల్లో 30కి పైగా ప్రాంతాల్లో లోకాయుక్త అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించి సోదాలు చేపడుతున్నారు. బెంగళూరు నగరంలో బీబీఎంపీ వలయ చీఫ్ ఇంజినీర్ టీడీ.నంజుండప్ప కార్యాలయం, నివాసంలో బీబీఎంపీ ఫైళ్లు, బంగారు ఆభరణాలు, నగదు, వివిధ వాణిజ్య కాంప్లెక్స్‌లతో పాటు వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డులు లభ్యమయ్యాయి.
భారీగా ఆభరణాలు స్వాధీనం
బీబీఎంపీ నాణ్యత నియంత్రణ, నాణ్యత హామీ విభాగ కార్యనిర్వాహక ఇంజినీర్ హెచ్‌బీ.కల్లేశప్ప ఇంటిలో భారీగా బంగారు ఆభరణాలు లభించాయి. రాజాజీనగర బెస్కాం ఇంజినీర్ నాగరాజ్‌కు చెందిన కృష్ణరాజపురం వద్ద ప్రియదర్శిని లేఔట్‌లోని ఇళ్లు, రాజాజీనగర బెస్కాం కార్యాలయం, అతడి బంధువు ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. కొళ్లేగాల వద్ద 6 ఎకరాల భూమి, బెంగళూరులో ఒక ఇల్లు, రెండు స్థలాలు, కోలారు తాలూకా నరసాపురం వద్ద భూమి ఉన్నట్లు తనిఖీలో తేలింది.
తుమకూరు జిల్లాలో..
తుమకూరు జిల్లా శిరా తాలూకా తావరకెరె పీహెచ్‌సీ వైద్యాధికారి జగదీశ్‌కు చెందిన తుమకూరు మంజునాథ్‌నగరలో కాంప్లెక్స్, శిరా తాలూకా యనహళ్లిలోని ఇంటిలో సోదాలు చేశారు. జగదీశ్ భార్య రూపా, సోదరుడు కాంతరాజ్ ఇంటిపై కూడా దాడి చేశారు. శిరా తాలూకా బరగూరులో తల్లి పేరుతో ఆస్తి ఉన్నట్లు లోకాయుక్త దాడిలో తెలిసింది. బాగల్‌కోటె పంచాయతీ రాజ్ శాఖ అకౌంటెంట్ మల్లేశ్ దుర్గద్‌కు చెందిన వీరాపుర రోడ్డులో ఉన్న ఇళ్లు, బీళగి తాలూకా తళ్లికేరిలోని ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడి చేసి పరిశీలిస్తున్నారు. లోకాయుక్త డీఎస్పీ సిద్దేశ్ నేతృత్వంలో దాడి జరిగింది.
కలబురిగిలో...
ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్న రాష్ట్ర రహదారుల అభివృద్ధి శాఖ అధికారి జగన్నాథ్‌కు లోకాయుక్త షాక్ ఇచ్చింది. కలబురిగిలోని ఓకళిక్యాంప్ లేఔట్‌లోని నివాసం, బెంగళూరులోని కార్యాలయం, ధన్నూర్ కే గ్రామంలోని ఇంటిలో దాడులు నిర్వహించారు. సుమారు 2 కిలోల బంగారు, వెండి, ఖరీదైన గడియారం, విలువైన వస్తువులు లభించాయి. లాకర్ బద్దలు కొట్టి పరిశీలించగా రికార్డులు, భారీగా నగదు లభ్యమైంది. ఆళందలో 30 ఎకరాల భూమి, బీదర్, బసవకళ్యాణలో ఆస్తి కలిగి ఉన్నట్లు తెలిసింది. కర్ణాటక గృహమండలి ఎఫ్‌డీఏ శివానంద కెంబావికి చెందిన విజయపుర నగరంలోని సుకోన్ కాలనీలోని నివాసం, ఆ జిల్లాలోని తిడగుంది గ్రామం వద్ద ఫాంహౌస్‌లో సోదాలు చేపట్టారు. కలబురిగిలో జిల్లా ఆహార సురక్షతాఅదికారి నాగరాజ్ ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేపట్టగా భారీ ప్రమాణంలో బంగారం, నగదు లభ్యమైంది. దావణగెరె నగర నిజలింగప్ప లేఔట్‌లోని జిల్లా సురక్షతా అధికారి డాక్టర్ నాగరాజ్ ఇల్లు, కార్యాలయం, ఫాంహౌస్‌తో పాటు అతడికి చెందిన 5 చోట్ల దాడి చేశారు. బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు
8 మంది అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
కోట్ల విలువైన బంగారు, వెండి నగలు, నగదు లభ్యం
లోకాయుక్త వలలో చిక్కిన అధికారులు
టీడీ.నంజుండప్ప, బీబీఎంపీ వలయ చీఫ్ ఇంజినీర్, డీపీఏఆర్, బెంగళూరు
హెచ్‌బీ.కల్లేశప్ప, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, బీబీఎంపీ
బీ.నాగరాజ్, ఏఈఈ, బెస్కాం, కోలారు
జగన్నాథ్, చీఫ్ ఇంజినీర్, ప్రజాపనుల శాఖ, కోలారు
జీఎస్.నాగరాజు, ఫుడ్‌సేఫ్టీ అధికారి, దావణగెరె
డాక్టర్ జగదీశ్, వైద్యాధికారి, తావరకెరె, తుమకూరు జిల్లా
మల్లప్ప సాబణ్ణ, ఎఫ్‌డీఏ, పంచాయతీరాజ్‌శాఖ, బాగల్‌కోటె
శివానంద శివశంకర్ కెంబావి, ఎఫ్‌డీఏ, గృహమండలి, విజయపుర
అవినీతిపై లోకాయుక్త పంజా
అవినీతిపై లోకాయుక్త పంజా
Comments
Please login to add a commentAdd a comment