శివాజీనగర: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీ పథకాలకు బడ్జెట్‌లో రూ.51,034 కోట్ల నిధులు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.52,000 కోట్లు కేటాయింగా ఈ పర్యాయం కోత వేశారు. శక్తి పథకానికి రూ.5,300 కోట్లు, గృహలక్ష్మి పథకానికి రూ. 28,608 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.10,100 కోట్లు కేటాయించారు. అన్న భాగ్య పథకం కింద 5 కే.జీ. ఆహార ధాన్యానికి బదులుగా ఇస్తున్న సహాయ ధనం స్థానంలో 5 కే.జీ. బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం రూ.6,500 కోట్లు కేటాయించారు. యువనిధి పథకం కింద 2.59 లక్షల మంది యువత పేర్లు నమోదు చేసుకోగా రూ.286 కోట్లు నగదు బదిలీ చేయనున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వటానికి ఈ యువతకు ఇండస్ట్రీ లింకేజ్ సెల్ కింద నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తానికి గ్యారెంటీలకు నిధులను కోత పెట్టడం విమర్శలకు దారితీసింది.
భార్య వేధింపులు, వకీలు ఆత్మహత్య
యశవంతపుర: భార్య పెట్టే వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలబురగిలో జరిగింది. పట్టణంలోని మాణికేశ్వరి కాలనీలో నివాసం ఉంటున్న న్యాయవాది బసవరాజ బిరాదార (47) మృతుడు. అతని సోదరుని ఫిర్యాదు మేరకు భార్య గీతాపై ఆర్‌జీ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలు ఇదే ఇంట్లో ఉండరాదని గీతా తరచూ గొడవపడేది. దీంతో విడాకుల కోసం ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ భార్య పెట్టే హింసను భరించలేక బసవరాజు ఉరి వేసుకున్నాడు.
వేశ్యావాటికపై దాడి
కలబురగి పట్టణంలోని వీరేంద్రపాటీల్ లేఔట్‌లో ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు దాడి చేశారు. ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసి, ఇద్దరు మహిళలను రక్షించారు.
బెంగళూరు వర్సిటీకి
మన్మోహన్ పేరు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ పేరును నామకరణం చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విధానసౌధలో బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు.
యాంటీ నక్సల్ పోలీసు దళం రద్దు
రాష్ట్రంలో నక్సలైట్లు పూర్తిగా అంతమయ్యారని, అందువల్ల యాంటీ నక్సలైటు పోలీసు దళాన్ని రద్దు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. మావోయిస్టుల పునర్వసతి కోసం రూ.10 కోట్లు కేటాయించామన్నారు. తమ ప్రభుత్వంలో ఆరుమంది నక్సల్స్ లొంగిపోయారని తెలిపారు. నక్సల్స్ పీడిత ప్రదేశాల్లో సదుపాయాల కల్పనకు రూ.19 కోట్లు కేటాయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment