రాష్ట్ర బడ్జెట్‌లో బళ్లారికి మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బడ్జెట్‌లో బళ్లారికి మొండిచేయి

Published Sat, Mar 8 2025 2:02 AM | Last Updated on Sat, Mar 8 2025 2:00 AM

రాష్ట

రాష్ట్ర బడ్జెట్‌లో బళ్లారికి మొండిచేయి

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన బళ్లారి జిల్లాకు బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మొండిచేయి చూపారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక ఉమ్మడి బళ్లారి జిల్లా ప్రస్తావనకు వస్తే విజయనగర జిల్లాలో కూడా కాంగ్రెస్‌ పార్టీదే హవా. అంతేకాకుండా ఉమ్మడి బళ్లారి జిల్లా నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పన్నుల రూపంలో సొమ్ము చెల్లిస్తుంటారు. అపారమైన ఇనుప ఖనిజ నిల్వలు, స్టీల్‌ ఇండస్ట్రీలు, పలు ఫ్యాక్టరీలు ఉన్నందున ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుంది. అయినా పేదరిక నిర్మూలన, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి, ఇళ్ల నిర్మాణాలకు, అర్ధంతరంగా ఆగిన పనులకు కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించపోవడంతో సిద్దూ బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎండుమిర్చి వ్యాపార కేంద్రం ఊసే లేదు

ఈ ప్రాంతంలో విస్తారంగా మిర్చి పండిస్తున్నారు. తుంగభద్ర ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల్లో మిర్చి పంట పండిస్తున్నారు. ఇక్కడ నుంచి సుదూరంలోని బ్యాడిగికి తరలించి రైతులు విక్రయిస్తుంటారు. ధరలు అమాంతంగా పడిపోవడంతో కనీసం రవాణా ఖర్చులు కూడా రైతులకు గిట్టడం లేదు. ఈనేపథ్యంలో జిల్లాలో అత్యాధునిక ఎండుమిర్చి వ్యాపార కేంద్రం ప్రారంభిస్తే రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆశలు పెట్టుకున్న రైతులకు బడ్జెట్‌లో నిధుల ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక విమానాశ్రయం విషయానికి వస్తే సిరివార సమీపంలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ నిర్మాణానికి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పనులు ప్రారంభించి వదిలేశారు. ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. మాటల వరకే విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

పూర్తి కాని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

ముఖ్యంగా బళ్లారి జిల్లాకే తలమానికంగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టి 17 ఏళ్లు పైబడింది. నత్తనడక పనులు జరుగుతున్నాయి కాని పూర్తిగా నిధులు కేటాయించకపోవడంతో ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నూతనంగా ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణంతో పాటు తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్‌గేట్లను అమర్చడానికి కూడా నిధులు కేటాయించలేదు. వీటితో పాటు పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి కూడా మొండిచేయి చూపారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు మినహా మిగిలిన అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థల వారు, ప్రజా సంఘాల వారు బడ్జెట్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు.

నెరవేరని అగ్ర నేత రాహుల్‌ గాంధీ హామీ

అంతేకాకుండా అపారెల్‌ పార్కుకు కూడా నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్‌లో నిధుల ప్రస్తావన చేసినా పనులు ప్రారంభించలేదు. ఈ బడ్జెట్‌లో కూడా ఆశలు పెట్టుకున్నారు. అపారెల్‌ పార్కు నిర్మాణం చేపడితే ఈ ప్రాంతంలో జీన్స్‌ రంగానికి మరింత మేలు చేసినట్లు అవుతుందని, స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ఎన్నికల ముందు ప్రచారంలో హామీ కూడా ఇచ్చారు. అలా రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ కూడా సీఎం సిద్ధరామయ్యకు పట్టకపోవడం గమనార్హం. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేశారు. అత్యంత వెనుక బడిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆర్టికల్‌– 371(జే)ని కూడా అమలు చేశారు. నిధుల కేటాయింపులో హై–క పరిధిలో ఏడు జిల్లాలు ఉంటే వాటిలో కలబుర్గి జిల్లాకే అగ్రస్థానం కల్పించడంపై కూడా సీఎంపై విమర్శలు వినవస్తున్నాయి.

ముఖ్యమంత్రి పద్దుపై వివిధ వర్గాల్లో

భిన్నస్వరాలు

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి నిధుల

ప్రస్తావన ఏదీ?

ఊసే లేని అపారెల్‌ పార్కు, ఎయిర్‌పోర్టు, ఇంజినీరింగ్‌ కాలేజీ

No comments yet. Be the first to comment!
Add a comment
రాష్ట్ర బడ్జెట్‌లో బళ్లారికి మొండిచేయి1
1/2

రాష్ట్ర బడ్జెట్‌లో బళ్లారికి మొండిచేయి

రాష్ట్ర బడ్జెట్‌లో బళ్లారికి మొండిచేయి2
2/2

రాష్ట్ర బడ్జెట్‌లో బళ్లారికి మొండిచేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement