లారీని ఢీకొన్న ఇన్నోవా.. ఐదుగురు దుర్మరణం
యశవంతపుర: ఇన్నోవా కారు వెనుక నుంచి లారీని ఢీకొన్న ఘటనలో ఐదుమంది మృతి చెందిన ఘటన చిత్రదుర్గ సిబార వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతులు బెంగళూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బీఎంటీసీ రిటైర్డ్ ఉద్యోగి శాంతమూర్తి (60), విద్యారణ్యపురవాసి రుద్రస్వామి(52), బెంగళూరు ఉత్తర తాలూకావాసి మల్లికార్జున (50) సహా మరో ఇద్దరు చనిపోయారు. వీరందరూ కారులో బెళగావి రేణుకా యల్లమ్మ ఆలయాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. సిబార వద్ద వేగంగా వెళ్తూ ముందున్న లారీని ఢీకొట్టడంతో ఐదు మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా నుజ్జయ్యాయి. మరొకరికి తీవ్ర గాయాలు తగిలాయి. చిత్రదుర్గ రూరల్ పోలీసులు చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బెంగళూరులోని కుటుంబసభ్యులు హుటాహుటిన చేరుకున్నారు. కొన్ని గంటల్లో ఇంటికి వస్తున్నామని చెప్పినవారు శవాలై కనిపించడంతో బోరున విలపించారు.
చిత్రదుర్గ వద్ద ఘోర దుర్ఘటన
మృతులు బెంగళూరువాసులు
Comments
Please login to add a commentAdd a comment