ఉరవకొండ తేరు.. జన హోరు
ఉరవకొండ: ఓం నమఃశివాయ అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తుండగా చంద్రమౌళీశ్వర మఠం రథోత్సవం వైభవం మిన్నంటింది. అనంతపురం జిల్లాలో ఉరవకొండ పట్టణంలోని గవిమఠం సంస్థానంలో ఆదివారం తేరు వేడుక ఘనంగా జరిగింది. హర హర మహదేవ శంభోశంకర అంటూ స్వామి వారి మహరథాన్ని ముందుకు లాగుతూ భక్తి పారవశ్యంతో మునిగారు. కర్ణాటకలోని పలు జిల్లాల నుంచి భక్తజనం, స్వామీజీలు తరలివచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్‌కు విశేష పూజలు, అభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. గవిమఠం 8వ పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి ఆధ్వర్యంలో చంద్రమౌళీశ్వరుని ఉత్సవ మూర్తిని భాజాభజంత్రీల మధ్య తేరులో ప్రతిష్టించారు. వేలాది భక్తులు శంభోశంకరున్ని స్మరిస్తూ ఘనమైన తేరును ఎదురు బసవణ్ణ గుడి వరకూ లాగారు. అక్కడ పూజలు చేసి మళ్లీ యథాస్థానానికి చేర్చారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment