హంపీలో పోలీసు సబ్ డివిజన్‌ను పునరుద్ధరించాలి
సాక్షి,బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో పర్యాటకుల రక్షణ, భద్రత కోసం పోలీసు సబ్ డివిజన్‌ను పునరుద్ధరించాలని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచిచారు. ఈమేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమాలకు వీడియో విడుదల చేశారు. కొప్పళ జిల్లా గంగావతి నియోజకవర్గం అనేగొంది సమీపంలోని కాలువ వద్ద ఇజ్రాయిల్ మహిళతో పాటు, స్థానిక హోంస్టే నడుపుతున్న మహిళపై దుండగులు దాడి చేసి, అత్యాచారం చేయడం, విదేశీ పర్యాటకులను కాలువలోకి తోయడం అందులో ఒక ఒడిసా వ్యక్తి మృతి చెందడం రాష్ట్రానికి మాయని మచ్చగా మిగిలిపోయిందన్నారు. ఈ దారుణ ఉదంతం తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఉమ్మడి బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు హంపీలో పర్యాటకుల భధ్రతకు పోలీస్‌సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేయించామన్నారు. ఒక డీఎస్‌పీ స్థాయి అధికారిని నియమించి 32 పోలీసు బృందాలను నియమించి 24గంటలూ హంపీ పరిసరాల్లో గస్తీ తిరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం పోలీసు సబ్ డివిజన్‌ను ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదన్నారు. పోలీసు గస్తీ కొరవడి పర్యాటక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయన్నారు. తక్షణం సీఎం సిద్ధరాయమ్య స్పందించి హంపీలో పోలీసు సబ్ డివిజన్‌న పునరుద్ధరించి డీఎస్పీ స్థాయి అధికారి, సీఐలు, ఎస్‌ఐలను నియమించాలని, అనెగొందిలో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించి పర్యాటకులకు భద్రత కల్పించాలన్నారు.
విదేశీ పర్యాటకురాలిపై అత్యాచారం దారుణం
హంపీలో పర్యాటకులకు భద్రత కల్పించాలి
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment