క్యాన్సర్ రెఫరల్ విభాగం మంజూరు
రాయచూరు రూరల్: రాయచూరుకు రూ.52 కోట్లతో కిద్వాయ్ క్యాన్సర్ రెఫరల్ విభాగాన్ని మంజూరు చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ పేర్కొన్నారు. శనివారం మాన్వి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య శాఖ, రిమ్స్, ఇతర సంఘ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన మేళాకు శ్రీకారం చుట్టి ప్రసంగించారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో అధిక శాతం గర్భకోశ క్యాన్సర్ కనపడుతోందన్నారు. స్తన క్యాన్సర్ మాదిరిగా గర్భ కోశ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టమన్నారు. గర్భ కోశ క్యాన్సర్ వ్యాధి నివారణకు 16 ఏళ్ల లోపు బాలికలకు టీకాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి రూ.400 కోట్ల నిధులు కేటాయించామన్నారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు విషయంలో పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కాగా శిబిరంలో మానసిక, కిడ్నీ, ఎముకలు, నేత్ర, గుండెపోటు, చర్మవ్యాధి, శ్వాసకోశ, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించారు. కార్యక్రమంలో మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు హంపయ్య నాయక్, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, అసిస్టెంట్ కమిషనర్ గజానన, జిల్లా ఆరోగ్య వైద్యాధికారులు సురేంద్ర బాబు, నందిత, శరణ బసవ, 200 మంది సీనియర్ వైద్యులు పాల్గొన్నారు.
క్యాన్సర్ రెఫరల్ విభాగం మంజూరు
Comments
Please login to add a commentAdd a comment