ఫిర్యాదులు తీసుకుని చర్యలు చేపట్టాలి
వృద్ధ తల్లిదండ్రులను వదిలేస్తున్నారు
నేటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా కనిపించడం లేదు. కొడుకులు పెళ్లిళ్లు కాగానే వేరు కాపురాలు పెడుతున్నారు. తమ పిల్లలు, కుటుంబమే చాలని, వృద్ధ తల్లిదండ్రులను పోషించడం చాదస్తంగా భావించే సంతానానికీ కొదవ లేదు. ఎల్లకాలం తల్లిదండ్రులను పోషించలేమని, తమకూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సమర్థించుకుంటారు. వారు ఎంత కష్టపడి తమను పోషించి ప్రయోజకులను చేశారనేది మర్చిపోతారు. కన్నవారి నుంచి ఆస్తులను తీసుకుని, వారిని అనాథాశ్రమంలో వదిలేసేవారు కొందరైతే, అది కూడా తమకు భారమేనని భావించి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో విడిచి వచ్చేవారు మరికొందరు. బెళగావి జిల్లాలో బిమ్స్ ఆస్పత్రిలో వృద్ధ తల్లిదండ్రులు వదిలేయడం బాగా పెరిగింది.
● సంతానం నిర్దాక్షిణ్యం
● బెళగావిలో మరీ అధికం
● వైద్యవిద్యాశాఖ మంత్రి ఆగ్రహం
● ఆస్తుల బదిలీని రద్దు చేయాలని ఆదేశం
శివాజీనగర: కన్నడనాట ఇటీవల వృద్ధులైన తల్లిదండ్రులను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో విడిచి వెళుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. పిల్లలు ఆస్తిని రాయించుకొని తల్లిదండ్రులను చికిత్స నెపంతో ఆసుపత్రుల్లో వదిలేస్తున్నారని వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాశ్ పాటిల్ అన్నారు. దీనిని అరికట్టేందుకు అలాంటి సంతానానికి ఆస్తుల బదిలీని రద్దు చేయాలని సూచించారు. ఆదివారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులనే అనాథలుగా చేస్తున్న మోసపూరితమైన వ్యవహారాలు అధికమయ్యాయి. ఇటువంటి అమానవీయ కార్యకలాపాలకు బ్రేక్ వేసేందుకు వైద్యవిద్యా శాఖ సిద్ధమైందని తెలిపారు.
ఆస్పత్రుల్లోనే ఎందుకు?
బెళగావి వైద్య విజ్ఞాన సంస్థ (బీఐఎంఎస్) ఆస్పత్రిలో 150 మందికి పైగా వయో వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు విడిచిపెట్టి వెళ్లిన కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇతర వైద్య సంస్థల్లో ఇటువంటి 100కు పైగా ఘటనలు జరిగాయి. ఇది చాలా బాధాకరం. అటువంటి సంతానానికి ఇచ్చిన వీలునామాలు, ఆస్తుల బదిలీని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఘటనల గురించి తెలిస్తే వైద్య విద్యా శాఖ డైరెక్టర్ (డీఎంఈ) తక్షణమే సహాయక జిల్లాధికారి (ఏసీ)కి ఫిర్యాదు చేయాలన్నారు. పిల్లలు కన్నవారిని చూసుకోవటానికి సాధ్యపడక వదిలేస్తారు. కొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల విడిచిపెట్టారు. కొందరైతే ఆస్తులను తమ పేర్లకు మార్చుకొని ఆ తరువాత చికిత్స నెపంతో ఆసుపత్రిలో చేర్చి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం, వసతి ఉచితంగా లభిస్తుందని తెలియడమే కారణం అని తెలిపారు. ఇటువంటి వృద్ధులను బెళగావి చుట్టుపక్కల గల 70 వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం కల్పించారు. అయితే ఇప్పటికీ చాలా మంది ఆసుపత్రుల్లోనే ఉన్నారు.
వయో వృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం– 2007 కింద బాధితుల నుంచి ఫిర్యాదులను తీసుకుని చర్యలను చేపట్టాలని అసిస్టెంట్ కమిషనర్, ఇతర వైద్యాధికారులు ఇందులో చొరవ చూపాలని మంత్రి సూచించారు. ఈ చట్టం గురించి అనేక మందికి తెలియదు. పిల్లలు గాని, ఆప్త బంధువులు వృద్ధులకు ఆర్థిక, వైద్య సదుపాయాలు కల్పించాలనే నియమముంది. అలా చేయని పక్షంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులను రద్దు చేసే చట్టబద్దమైన హక్కు కలిగి ఉంటారని మంత్రి తెలిపారు. సెక్షన్ 23 ప్రకారం పిల్లలు ఆస్తిని వంశపారంపర్యంగా పొందిన తరువాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినట్లయితే ఆస్తి రద్దుకు, తామే మళ్లీ పొందేందుకు చట్టంలో ఆనుమతి ఉందని తెలిపారు.
ఫిర్యాదులు తీసుకుని చర్యలు చేపట్టాలి
ఫిర్యాదులు తీసుకుని చర్యలు చేపట్టాలి
Comments
Please login to add a commentAdd a comment