ప్రమాదంలో పచ్చని కనుమలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో విస్తారమైన లోయలు, అడవులతో కూడిన కొండ ప్రాంతాలు ప్రకృతి సంపదకు నిలువెత్తు దర్పణం. రాష్ట్రానికి ఎంతో ఆహ్లాదం, ఆదాయం అందించే పశ్చిమ ఘాట్లు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. విచ్చలవిడిగా పర్యాటక రంగం, ఆ పేరుతో జరుగుతున్న పనుల కారణంగా పశ్చిమ కనుమలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగాలు ప్రస్తుతం ఈ మేరకు పశ్చిమ ఘాట్ల కనుమరుగుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. రానున్న రోజుల్లో ముప్పు ఇంకా పెరుగుతుందని హెచ్చరించాయి.
19 ఏళ్లలో 1403 ప్రమాదాలు
పశ్చిమ ఘాట్లలో గడిచిన 19 ఏళ్లలో 1,403 ప్రకృతి విపత్తులు జరిగాయి. 1,403 సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. 98 మంది మరణించారు. అభివృద్ధి పేరిట అశాసీ్త్రయంగా అడవులను నరికి ఆక్రమించడం, రోడ్ల విస్తరణ కోసం చెట్లను కొట్టివేయడం, కొండలను, మట్టిని తరలించడం వల్ల ప్రకృతి ఆగ్రహిస్తోంది. ఇంకా అనేక రకాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలా మానవ నిర్మిత తప్పిదాల కారణంగా ఘాట్లు బలహీనమవుతున్నాయి. దీంతో ఓ మోస్తరు వర్షాలు, కుండపోత వానలకు అతలాకుతలమవుతోంది. తరచూ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. భూమి కుంగిపోతోంది. పశ్చిమ కనుమల్లోని 8 జిల్లాల పరిధిలోని 31,231 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో భూమి ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని నివేదికలో పేర్కొన్నారు. కొందరు ఆక్రమణదారులు తమ స్వార్థం కోసం అడవులను నాశనం చేస్తూ ఆక్రమించుకుంటున్నారు. వేలాది ఎకరాల్లో అటవీ భూమి కబ్జాలకు గురవుతోంది. భారీగా రోడ్ల నిర్మాణం, జలాశయాలు, ఆనకట్టలను నిర్మించడం ఇక్కడి పర్యావరణానికి సరిపోవడం లేదు.
విచ్చలవిడి నిర్మాణాలు,
అడవుల నరికివేతలు..
పశ్చిమ ఘాట్లకు తీవ్ర ముప్పు
సర్కారుకు వివిధ శాఖల నివేదిక
నివారణ చర్యలకు సూచన
విరుగుతోన్న కొండచరియలు
కొడగు జిల్లాలో మొత్తం 96 శాతం భూభాగం కొండచరియలు విరిగిపడే ప్రమాదకర స్థితి ఉందని నివేదిక తెలిపింది. దక్షిణ కన్నడ జిల్లాలో 94.9 శాతం, ఉత్తర కన్నడ జిల్లాలో 81.3 శాతం మేర భూభాగం తీవ్ర అపాయంలో ఉందని హెచ్చరించింది.
ఉత్తర కన్నడ జిల్లాలో అత్యధికంగా 609 సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. చిక్కమగళూరులో 260, కొడుగులో 188, దక్షిణ కన్నడలో 166 సార్లు కొండ చరియలు కూలిపోయాయి
గడిచిన ఏడాది కాలంలో కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో జరిగిన కొండచరియల ప్రమాదాల్లో మొత్తం 98 మంది మృత్యువాత పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పశ్చిమ కనుమల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలి. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించాలని ఇక్కడి స్థానికులు కోరుతున్నారు. పర్యాటకంతో పాటు అశాసీ్త్రయంగా జరుగుతున్న అభివృద్ధిని కట్టడి చేయాలని డిమాండ్లు ఉన్నాయి.
ప్రమాదంలో పచ్చని కనుమలు
ప్రమాదంలో పచ్చని కనుమలు
Comments
Please login to add a commentAdd a comment