ఆరోగ్యమే మహాభాగ్యం
బళ్లారిటౌన్: ప్రతినిత్యం ఒత్తిడితో పని చేసే మీడియా ప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే మహా భాగ్యమని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ యల్లా రమేష్ బాబు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య అభియానలో భాగంగా డీహెచ్‌ఓ కార్యాలయంలో శనివారం మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన పరిచయ జాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. త్వరలో మీడియా ప్రతినిధులకే ప్రత్యేక ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య శాఖ, మీడియా సమాజంతో సంధానానికి వంతెనలని, ఆరోగ్య వ్యవస్థ ఉన్నతీకరణకు మీడియా చేతులు కలపాలన్నారు. బళ్లారి జిల్లా ఆరోగ్య వ్యవస్థ విషయంలో రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయన్నారు. అయితే గత నవంబర్ నెలలో జరిగిన బాలింత మృతి వల్ల కొంత దుష్పరిణామం ఎదురైనందున జిల్లా ఆస్పత్రికి రోగులు రావడం తగ్గుముఖం పట్టిందన్నారు. మీడియా, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించి మంచి కథనాలు రాసినందున మళ్లీ పుంజుకుందన్నారు. జిల్లా సర్జన్ ఎన్.బసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి ఒక కార్పొరేట్ ఆస్పత్రిని తలపిస్తోందన్నారు. ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య సేవలు అందుతున్నాయన్నారు. సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో విమ్స్ ఆస్పత్రిలో మహిళల కాన్పులు జరిగేవన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో మెరుగైన సేవలతో కాన్పులు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఆర్‌సీహెచ్ అధికారి హనుమంతప్ప సర్వేక్షణ అధికారి మరియం బీ, డాక్టర్ పూర్ణిమ కట్టిమని, డాక్టర్ వీరేంద్ర కుమార్, డాక్టర్ ఆర్.అబ్దుల్లా, రోహన్ వనకుంది, ఈశ్వర్ దానప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment