వ్యాపార వాణిజ్యోద్యమ అభివృద్ధికి ఒప్పందం
బళ్లారిఅర్బన్: వాణిజ్య పరిశ్రమల అభివృద్ధి సాధనకు పరస్పరం సహకారం అందించుకోవడానికి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మైసూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థతో సంయుక్త ఒప్పందాన్ని చేసుకున్నారు. బళ్లారి జిల్లాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి మైసూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కేవీ.లింగరాజ మైసూరులో జరిగిన సంయుక్త సమవేశంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేవలం వ్యాపారాలు, వాణిజ్యానికే పరిమితం కాకుండా యువశక్తికి చక్కటి భవిత రూపొందించడానికి స్కిల్స్ డెవలప్‌మెంట్, అన్నదాతలకు ఉచితంగా భోజనం, క్లినిక్, విశ్రాంతిధామం వంటి ప్రజాకర్షక సేవా పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలకు సమాజంలోని అన్ని వర్గాల నుంచి విశేషమైన ఆదరణతో పాటు అభినందనలు లభించాయన్నారు. ఉభయ జిల్లాలు కలిసి కట్టుగా పని చేయడం ద్వారా సేవా రంగంలో కొత్త అవకాశాలకు దారి ఏర్పడిందన్నారు. మైసూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేవీ.లింగరాజ మాట్లాడుతూ ఈ ఒప్పందాల వల్ల ఉభయ జిల్లాల పారిశ్రామిక రంగంలో కొత్తదనానికి చోటు లభించిందన్నారు. బళ్లారిలో రైతన్నల భోజన పథకంతో స్పూర్తి పొంది రూ.10లకే మైసూరులో కూడా ఏపీఎంసీకి వచ్చే రైతులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించామన్నారు. బళ్లారి సంస్థ అనేక విషయాల్లో రాష్ట్రానికే ఆదర్శప్రాయం అయిందన్నారు. మైసూరు హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆ జిల్లా డైరెక్టర్ నారాయణ గౌడ మాట్లాడుతూ రైతన్నల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. వేలాది మందికి ఉపాధి లభించిందని, ఇది మైసూరు పర్యాటక కేంద్రానికి దక్కిన అవకాశం అన్నారు. ప్రముఖులు డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున గౌడ, అశోక్, శివాజీ రావు, ఆనంద్, అవ్వారు మంజునాథ, దొడ్డనగౌడ, సొంతా గిరిధర్, సురేష్‌బాబు, రామచంద్ర, సుధాకర్ శెట్టితో పాటు ఉభయ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పదాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment