మళ్లీ కరెంటు చార్జీల షాక్
శివాజీనగర: ప్రభుత్వం ఎప్పుడు ఏ చార్జీ పెంచుతుందోనని ప్రజలు కలవరపడాల్సి వస్తోంది. గతంలో కరెంటు, బస్సు చార్జీలు, మద్యం ధరలను పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుల జీవితం దినదిన గండంగా తయారైంది. బతుకు బండి భయపెడుతోంది.
ఈ పరిస్థితుల్లో కర్ణాటక విద్యుచ్ఛక్తి కమిషన్ (కేఈఆర్‌సీ) కరెంటు వాడకందార్లకు షాక్ ఇచ్చింది. ప్రతి యూనిట్ పై 36 పైసలు చార్జీలను పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. సవరించిన చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
పెంపు ఎందుకంటే
పెంపు వల్ల ప్రతి ఇంటి మీద సుమారు 90 రూపాయల భారం పడనుంది. దీనికి కారణాలు మాత్రం అనూహ్యంగా ఉన్నాయి. విద్యుత్ ప్రసరణ, సరఫరా సంస్థల సిబ్బంది పింఛన్, గ్రాట్యుటీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా మొత్తాన్ని వినియోగదారుల జేబు నుంచి వసూలు చేయడానికి చార్జీలను పెంచడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కేఈబీని రద్దుచేసి, కేపీటీసీఎల్, 5 ఎస్కాంలను ఏర్పాటు చేసిన సమయంలో ఉద్యోగుల పింఛన్, గ్రాట్యూటీని ప్రభుత్వమే భరిస్తుందని అంగీకరించింది. అయితే 2021 నుంచి ఆ సొమ్మును తాము భరించలేమని, విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అప్పట్లో కేఇఆర్‌సీ ముందు ప్రస్తావించినపుడు సున్నితంగా తిరస్కరించింది. గతేడాది మార్చిలో హైకోర్టులో విచారణకు వచ్చినపుడు వినియోగదారులపై పింఛన్ బదిలీ భారాన్ని మోపడంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సర్కారుకు అనుకూలమైంది. చివరకు యూనిట్‌పై 36 పైసలు పెంచి ఆ డబ్బును పింఛన్లకు చెల్లిస్తారు.
ప్రజలపై వేల కోట్ల భారం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2021 నుంచి 2024 వరకు రూ. 4,659 కోట్లను సేకరించాల్సి వచ్చింది. ఈ సొమ్మును ప్రస్తుత సంవత్సరం నుండే 6 కంతులలో వినియోగదారులు ఇవ్వాల్సి ఉంటుంది.
యూనిట్‌పై 36 పైసల పెంపు
ఏప్రిల్ 1 నుంచి అమలులోకి
విద్యుత్ ఉద్యోగుల పింఛన్ల సర్దుబాటుకు ప్రజల నుంచి వసూలు
రూ. 4600 కోట్లకు పైగా భారం
ప్రజలకు ఇబ్బంది లేదు: మంత్రి
విద్యుత్ ధర పెంపుతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కాదని, గృహజ్యోతి పథకం ద్వారా నష్టం ఏమీ లేదని, పెంపునకు గృహజ్యోతి కారణం కాదని మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చెప్పారు. బెంగళూరులో మాట్లాడిన ఆయన, గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్‌ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. 200 యూనిట్‌ల కంటే అధికంగా వాడేవారికి చార్జీల పెరుగుదల అన్వయిస్తుందని తెలిపారు. చార్జీల పెంపు వల్ల ఇబ్బంది లేదని చెప్పడం విశేషం.
ప్రజలకు అవస్థలు: విజయేంద్ర
విద్యుత్ చార్జీలను పెంచడంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీల పెంపును అనుసరిస్తోంది, రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు ఉచిత విద్యుత్ అని చెబుతున్నారు. మరోవైపు ప్రజా పనుల శాఖలోనే 8 వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. అసెంబ్లీలో అన్ని విషయాలను చర్చిస్తామని తెలిపారు.
మళ్లీ కరెంటు చార్జీల షాక్
మళ్లీ కరెంటు చార్జీల షాక్
Comments
Please login to add a commentAdd a comment