
పార్టీలకు అతీతంగా సముదాయ అభివృద్ధి
●పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప
హొసపేటె: అంతర్గత రిజర్వేషన్లను అమలు చేస్తామని, దాని గురించి ఎటువంటి సందేహం అవసరం లేదని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కేహెచ్.మునియప్ప సూచించారు. హోస్పేటలోని ఏఆర్‌ఎస్ హోమ్‌స్టే ఆడిటోరియంలో మాదర చెన్నయ్య సేవా సమితి ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలకు సామాజిక న్యాయం అందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 1991 నుంచి 7 పర్యాయాలు ఎంపీగా ఈ సంఘం తరపున నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. సముదాయంలోని అందరూ ఎంపీలు అప్పటి ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్.మన్మోహన్ సింగ్‌లకు ప్రతినిధి బృందాన్ని పంపించి సముదాయం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ముందు అడుగు వేసేందుకు కృషి చేశామన్నారు. అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయడానికి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని తెలిపారు. మాదార చెన్నయ్య స్వామీజీ, ఎంపీ గోవిందా కారజోళ, మాజీ మంత్రి నారాయణ స్వామి, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.