
పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటపై దాడి
రాయచూరు రూరల్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచిన ఘటన బాగల్‌కోటె జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. జమఖండి ఉళ్లాగడ్డి కాలనీలో గాణిగ సమాజానికి చెందిన లక్ష్మి, మరాఠ సముదాయానికి చెందిన అప్పాజీ ప్రేమించుకున్నారు. యువతి కుటుంబ సభ్యుల వ్యతిరేకత మధ్య ఆ జంట పెళ్లి చేసుకోడానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న యువతి లక్ష్మి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని యువకుడిపై దాడి చేశారు. యువతిని కూడా రక్తం కారేలా కొట్టి తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయంలో యువకుడు అప్పాజీని తన చేయి వదల వద్దని రక్తం కారుతున్నా ఆటోలో కూర్చొని చేయి చూపుతూ తనను రక్షించాలని అభ్యర్థించిన లక్ష్మి తీరు చూపరులందరి మనస్సులను కదిలించింది. ఘటనపై జమఖండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువతి కుటుంబ సభ్యుల చేతిలో
యువతీ యువకులకు గాయాలు