సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ నేతల నడుమ ఉన్న పొరపొచ్చాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సిట్టింగ్‌కే సీటు ఇవ్వాలని, కమ్యూనిస్టులను ప్రోత్సహించొ ద్దని ఓ నియోజకవర్గ నేతలు.. తమ పెత్తనం కొనసాగడం లేదని ఇంకో నియోజకవర్గంలో.. మరో చోట తాము ప్రతిపాదించే వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. అంతేకాక పక్క జిల్లాలకు వెళ్లి ఆంతరంగిక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, వైరా, ఇల్లెందు నియోజకవర్గాల్లో కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. అయితే, అధిష్టానం పెద్దలు మాత్రం అందరి ఫిర్యాదులను సావధానంగా విని సముదాయించి పంపుతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికల తరుణాన బీఆర్‌ఎస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
పాలేరు సీటుపై రచ్చ..
ఉమ్మడి జిల్లాలో ఆది నుంచి పాలేరు సీటుపై రచ్చ కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌తో సీపీఎం, సీపీఐకి పొత్తు కుదిరితే సీపీఎం ప్రాధాన్యతగా పాలేరును కోరుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటివరకు పొత్తుపై ప్రకటన వెలువడలేదు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తప్పక బరిలో నిలుస్తామని ప్రకటించారు. మరోపక్క బీఆర్‌ఎస్ నేతలు పాలేరు నుంచి మళ్లీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డే పోటీ చేస్తారని వెల్లడించారు. వారం క్రితం ఎమ్మెల్యే కందాల అనుచరులు నియోజవర్గ రాజకీయ పరిస్థితులను విన్నవించేందుకు సీఎంను కలవడానికి వెళ్లగా అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని కలిసినట్లు సమాచారం. కొందరు పార్టీ నేతలు కమ్యూనిస్టులను ప్రోత్సహిస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. అయితే, నాయకులు మాత్రం ధాన్యం కొనుగోలు విషయమై పల్లాను కలిసినట్లు చెబుతున్నా, కందాలకు టికెట్, కమ్యూనిస్టుల దూకుడు పైనే చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
పెత్తనంపై వైరాలో వార్
వైరా నియోజవకర్గంలోని ఆత్మీ య సమ్మేళనాల్లో నేతల అలకలు వారి మధ్య అంతరా న్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు, క్షేత్ర స్థాయి ఉద్యోగుల బదిలీల్లో తమ ప్రతిపాదనలను తొక్కిపెట్టి ఇతర నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని పార్టీ నేతలు అధిష్టానం ముందు వాపోయినట్లు సమాచారం. ఎక్కడా తమకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఇతర నేతలు నియోజకవర్గ రాజకీయాల్లో తలదూర్చుతున్నట్లు చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరోపక్క పార్టీపరమైన కార్యక్రమాలన్నీ మూడు గ్రూపులుగా నిర్వహిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు చేస్తున్న వారిని గాడిలో పెట్టకపోవడం, పార్టీ సమావేశాలకు వారిని ఆహ్వానించకపోవడం వంటి పరి ణామాలతో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ మూడు ముక్కలాటలా మారిందని కేడర్‌లో చర్చ జరుగుతోంది.
మహబూబాబాద్‌లో ఇల్లెందు రాజకీయం..
ఇల్లెందు నియోజకవర్గ బీఆర్‌ఎస్ రాజకీయం ఇటీవల మహబూబాబాద్ కేంద్రంగా వేడెక్కింది. కొందరు నేతలు మహబుబాబాద్‌లో సమావేశమై ఎమ్మెల్యే హరిప్రియపై అసమ్మతి జెండా ఎగురవేసినట్లు తెలిసింది. అలాగే, ఎంపీ కవితకు నియోజకవర్గంలోని పరిణామాలను వివరించి ఇకనుంచైనా దృష్టి సారించి పార్టీ కోసం పనిచేసే వారిని కాపాడుకోవాలని కోరినట్లు సమాచారం. అలాగే మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు అసమ్మతి నేతలు సమాయత్తమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయం జోరుగా సాగినా ఆ తర్వాత చల్లారింది. ఇంతలోనే ఎమ్మెల్యేపై ఓ వర్గం తిరుగుబావుటా ఎగురవేసి మహబూబాబాద్‌లో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment