● కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు విశ్వసించరు ● బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ధర్మారావు
ఇల్లెందు: మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులపై సీబీఐ విచారణ కోరలేదని, ఏ ఒక్కరిపైనా కేసులు పెట్టలేదని, బీఆర్‌ఎస్ అవినీతిపై విచారణ కోరని కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడా ఊసే ఎత్తడం లేదన్నారు. అధికారం కోసం అడ్డగోలు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్.. ఆ హామీలు అమలు చేసే యోచనలో లేదని విమర్శించారు. రైతు రుణమాఫీ అడ్రస్ లేదని, నిరుద్యోగులకు భృతి మాటే ఎత్తడం లేదని, మహిళలకు రూ.2,500 ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని, తెలంగాణలో 17 సీట్లూ బీజేపీ గెలువటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని పేదలు బీజేపీకి దగ్గరయ్యారని, 22 కోట్ల మంది భారతీయులు శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని టీవీల ద్వారా వీక్షించారని తెలిపారు. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం అందించిన ఘనత మోడీకే దక్కిందన్నారు. దేశంలో మోడీ హవా సాగుతోందని, ఏ పార్టీతో పొత్తు లేకుండా రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకుందని చెప్పారు. సమావేశంలో నాయకులు రంగాకిరణ్, బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాళ్ల సోమసుందర్, బలగాని గోపీకృష్ణ, మావునూరి మాధవ్, కొల్లి సంజీవరెడ్డి, మిర్యాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment