ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత ధ్వజారోహణం చేయడమే కాక రుద్రహోమం నిర్వహించిన అర్చకులు శ్రీవారు, అమ్మవార్లను గజవాహనంపై గిరి ప్రదక్షిణ చేయించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ, సూపరింటెడెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
రామదాసు మందిరంలో చైన్నె భక్తుల కచేరీ
నేలకొండపల్లి: భక్త రామదాసు జన్మస్థలమైన నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరంలో చైన్నెకి చెందిన భక్తులు కచేరీ నిర్వహించారు. దేశంలోని అన్ని రామదాసు మందిరాలను సందర్శించి కచేరీలు చేస్తున్న 15మంది బృందం సోమవారం నేలకొండపల్లికి చేరింది. ఈ సందర్భంగా రామదాసు వాడిన బావితో పాటు ఆడిటోరియంలోని పరిశీలించాక ఆయన విగ్రహం వద్ద పూజలు చేశారు. ఆతర్వాత మందిరంలో రామదాసు కీర్తనలతో కచేరీ నిర్వహించగా పలువురు స్థానికులు సైతం పాల్గొన్నారు. మందిరం పూజారి సౌమిత్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈగా యుగంధర్
ఖమ్మంఅర్బన్: ఆర్‌అండ్‌బీ ఖమ్మం సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్‌ఈ)గా వి.యుగంధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఎస్‌ఈగా ఉన్న హేమలత ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఖమ్మం ఈఈ యుగంధర్‌కు ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇంజనీర్లు, కార్యాలయ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు.

జమలాపురంలో ధ్వజారోహణం