ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ ముద్దగుల నవీన్‌తో పాటు పాత నేరస్తుడు మంజుల విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం టూటౌన్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. ఖమ్మంలోని ఎన్నెస్పీ కాలనీలో ఎస్సై రామారావు ఆధ్వర్యాన పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి వీరిద్దరు పారిపోయే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా ద్వారకనగర్ వాసులైన పాత నేరస్తులు నవీన్, విజయ్‌కుమార్‌గా తేలిందని తెలిపారు.
పలు నేరాల్లో నిందితులు
గత నెల 9న ఎన్నెస్పీ కాలనీలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని బెదిరించిన వీరిద్దరు రూ.30వేలు లాక్కుని పారిపోయారు. అలాగే, కవిరాజ్‌నగర్‌లో గత నెల 14న అర్ధరాత్రి బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కళ్లల్లో కారం చల్లి బ్యాగ్ లాక్కోవడానికి యత్నించగా సదరు వ్యక్తి ప్రతిఘటించడంతో పారిపోయారు. కాగా, నవీన్ ఖమ్మంలో కొన్నేళ్లుగా గొడవలు, సెటిల్‌మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, రెండు హత్యాయత్నం కేసులతో పాటు ఇతర కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడని సీఐ తెలిపారు. నవీన్‌పై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉందని పేర్కొన్నారు. మరో నిందితుడు విజయ్‌కుమార్‌పై 2021లో ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గంజాయి కేసు నమోదు కాగా, వీరి నుంచి స్కూటీ స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
ముగ్గురు విద్యార్థినులకు ఫుడ్‌ఫాయిజన్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూని యర్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థినులకు వాంతులు, విరోచనాలు కావటంతో కళాశాల బాధ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కాగా, ఆదివారం బయటకు వెళ్లిన విద్యార్థినులు హోటల్‌లో తిన్న కారణంగా వాంతులు, విరోచనాలు అయినట్లు కళాశాల బాధ్యులు వెల్లడించారు.
మహిళ మెడలో గొలుసు చోరీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఇందిరానగర్ జంక్షన్‌లోని వీఆర్‌కే సిల్క్ వెనక వీధిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి నున్నా లత తన ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా రాధాకృష్ణనగర్ రోడ్డు –1లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలో గొలుసు లాగారు. ఈక్రమాన గొలుసు తెగిపోగా సుమారు 3గ్రాముల మేర దుండగుల చేతికి చిక్కింది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
ట్రాక్‌పైకి వచ్చిన ట్రాక్టర్ సీజ్
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం రైల్వేగేట్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పైకి రావడంతో ముదిగొండ మండలం గంధసిరి వాసికి సంబంధించి ఇసుక ట్రాక్టర్‌ను మంగళవారం సీజ్ చేసినట్లు జీఆర్పీ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం చైన్నె నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ పందిళ్లపల్లి స్టేషన్ సమీపానికి వస్తుండగా రామకృష్ణాపురం గేట్‌పైకి ట్రాక్టర్ డ్రైవర్ చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన లోకో పైలట్ వేగాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. ఈమేరకు లోకో పైలట్ ఫిర్యాదుతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి యజమాని, డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment