
పంటలు ఎండిపోకుండా సాగునీరు
● ప్రభుత్వ కార్యక్రమాలు పటిష్టంగా అమలుచేయాలి ● కలెక్టర్, అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి
కూసుమంచి: ప్రభుత్వ కార్యక్రమాలను పటిష్టంగా అమలుచేసే బాధ్యత అధికారులదేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్షి, షాదీముబారక్ లబ్ధిదారులకు శుక్రవారం చెక్కులు పంపిణీ చేసిన మంత్రి, మహిళా మత్స్యకారులు చేపలు విక్రయించేందుకు సబ్సిడీపై మంజూరైన సంచార వాహనాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఎండలు ముదురుతున్నందున పంటలు ఎండిపోకుండా సాగునీరు సరఫరా చేయాలని, సాగర్ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ తాగు, సాగునీటికి ఇబ్బందులు రానివ్వొద్దని సూచించారు. అలాగే, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూసేకరణ, పరిహారంపై సూచనలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ రహదారికి అవసరమైన భూమి సేకరించాలని, నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ఆర్డీఓ నర్సింహారావు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ ఎస్‌ఈలు హేమలత, మంగళంపూడి వెంకటేశ్వర్లు, ఈఈలు అనన్య, యుగంధర్, పుష్పలత, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని జుజుల్‌రావుపేటలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 9న ప్రతిష్ఠాపన పూజలు జరగనుండగా మంత్రి పొంగులేటి పూజలు చేశారు. అనంతరం తురకగూడెం, కేశ్వాపురంల్లో సీసీ రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
●ఖమ్మంరూరల్/ఖమ్మం వన్‌టౌన్/ఖమ్మం వ్యవసాయం: ఇందిరమ్మ ఇళ్లను మండలంలోని ఆరెంపులకు పైలట్ ప్రాజెక్టుగా కేటాయించగా, విడతల వారీగా అర్హులందరికీ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూరల్ మండలం ఆరెంపుల, బారుగూడెం, ఏదులాపురంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాగా, మంత్రిని రియల్ ఎస్టేట్ అసోసియేషన్, బిల్డర్స్ అసోసియేషన్ బాధ్యులు కలిసి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై రాయితీ ఇచ్చినందుకు కృతజ్ఙతలు తెలిపారు. పాత జీపీల్లోని లే ఔట్ల ప్లాట్లకు కూడా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టించుకోవాలని కోరారు. ఆతర్వాత రెడ్డిపల్లికి చెందిన సీపీఐ నాయకుడు లింగా వెంకటనారాయణ తల్లి మల్లమ్మ మృతి చెందగా మంత్రి నివాళులర్పించారు. ఇటీవల మృతి చెందిన డిప్యూటీ సీఎం పీఓ తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను మంత్రి పొంగులేటి పరామర్శించారు. కాగా, విద్యుత్ ఎస్‌ఈగా కొద్దిరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసాచారి మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment