
రైల్వే లైన్ పనులు త్వరగా ప్రారంభించండి
కేంద్ర రైల్వే మంత్రికి మంత్రి తుమ్మల లేఖ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాండురంగాపురం – మల్కాన్‌గిరి రైల్వేలైన్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే మార్గాన్ని తొలిదశలోనే సారపాక వరకు త్వరగా పూర్తిచేస్తే భక్తులు రైలులో చేరుకుని, అక్కడి నుంచి ఇతర వాహనాల్లో భద్రాచలానికి చేరుకునే వీలుంటుందని మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తద్వారా భద్రాచలానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఇదే సమయాన సత్తుపల్లి – కొవ్వూరు, పెనుబల్లి(ఖమ్మం) – కొండపల్లి(అమరావతి) వరకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ఆ లేఖలో తుమ్మల కోరారు.
జమలాపురంలో
ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించా రు. స్వామి మూలవిరాట్‌తో ఆలయ ఆవరణ లో ని స్వామివారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేయగా, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం, పల్లకీసేవ జరిపించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈనెల 27న బార్
అసోసియేషన్ ఎన్నికలు
ఖమ్మం లీగల్: తెలంగాణ బార్ కౌన్సిల్ ఆదేశానుసారం ఈనెల 27న ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి చింతనిప్పు వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15న తుది ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుందని, 17 నుంచి 20 వరకు నామినేషన్ దాఖలు, పరిశీలన చేపట్టాక అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఆపై ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 27న ఎన్నికల నిర్వహణ, అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుందని తెలిపారు.
గురుకుల అధ్యాపకురాలికి డాక్టరేట్
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల గణిత అధ్యాపకురాలు జి.శంకరజ్యోతికి డాక్టరేట్ లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ రెగ్యులర్ డోమినేషన్ ఇన్ లిటాక్ట్ గ్రాఫ్స్’ అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఓయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన శంకరజ్యోతి ప్రస్తుతం తనికెళ్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.రజిత, వైస్ ప్రిన్సిపాల్ బి.రాజేశ్వరి, అధ్యాపకులు అభినందించారు.
వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులను అభినందించిన ఎంపీ
ఖమ్మంవన్‌టౌన్: నేషనల్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నీ లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం అభినందించారు. జిల్లాకు చెందిన ఎస్.కే.సమీరుద్దీ న్, బండి రాము, సురేష్, రమావత్ కోటేశ్వర్, మహ్మద్ సమీ జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ ఖమ్మంలో సన్మానించగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారా యణ, పాపానాయక్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో గళం విప్పుతా..
ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల సమావేశం జరగగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు, పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్లే రైల్వేలైన్ అలైన్‌మెంట్ మార్పు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు.

రైల్వే లైన్ పనులు త్వరగా ప్రారంభించండి
Comments
Please login to add a commentAdd a comment