
రాజీతోనే మానసిక ప్రశాంతత
● ఇరుపక్షాల గెలుపు లోక్ అదాలత్‌తోనే సాధ్యం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్
ఖమ్మం లీగల్: లోక్ అదాలత్‌లో ఇరుపక్షాలకు రాజీ పడడం ద్వారా కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, తద్వారా ఇద్దరూ గెలిచినట్లవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇరువర్గాల కక్షిదారులు రాజీ పడితే ఆర్థిక ప్రయోజనాలతో పాటు సమయం వృథా జరగదని, కేసులు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. ఇక్కడ జారీ చేసే అవార్డు సుప్రీంకోర్టు అవార్డుతో సమానమని పేర్కొన్నారు. అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి మాట్లాడుతూ కేసుల తక్షణ పరిష్కారం లోక్ అదాలత్‌తోనే సాధ్యమవుతుందని, ఇక్కడ తీర్పుపై అప్పీల్‌కు అవకాశం లేదని చెప్పారు. కాగా, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులకు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి కే.వీ.చంద్రశేఖరరావు అధ్యక్షత వహించగా మోటార్ ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళకు రూ.14 లక్షల పరిహారం జారీ చేశారు. అలాగే, రాజీపడిన భార్యాభర్తలు కలిసి జీవించడానికి నిర్ణయించుకోగా వారికి పూల మొక్క అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు ఎం.అర్చనాకుమారి, దేవినేని రాంప్రసాద్‌రావు, ఎం.కల్పన, వి.శివరంజని, కాసురగడ్డ దీప, బిక్కం రజని, ఏపూరి బిందుప్రియ, వి.మాధవి, బి.నాగలక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
19,345 కేసుల పరిష్కారం
జిల్లా కోర్టుతో పాటు జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా మొత్తం 19,345 కేసులు పరిష్కారమయ్యాయి. గతంలో నిర్వహించిన లోక్ అదాలత్‌ల మాదిరిగానే ముందు నుంచి విస్తృత ప్రచారం చేయడంతో అత్యధిక కేసులు పరిష్కారమయ్యాయని భావిస్తున్నారు. కాగా, మోటార్ వాహన ప్రమాద బీమా కింద 62 కేసుల్లో రూ.2,71,77,000 పరిహారం చెల్లింపునకు బీమా కంపెనీలు అంగీకరించాయి.
●ఖమ్మంక్రైం: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెద్దసంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని కమిషనర్ సునీల్‌దత్ అభినందించారు. పకడ్బందీ ప్రణాళికతో రాజీ పడదగిన కేసులను గుర్తించడమేకాక కక్షిదారులను ఒప్పించడంలో ఏఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది కృషి చేయడంతో మెరుగైన ఫలితం వచ్చిందని శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
పరిష్కారమైన కేసుల వివరాలు
క్రిమినల్ కేసులు 643
సివిల్, భూతగాదా కేసులు 51
మోటార్ యాక్సిడెంట్ కేసులు 62
ట్రాఫిక్ చలానా కేసులు 16,169
ప్రీ లిటిగేషన్ కేసులు 18
డ్రంక్ అండ్ డ్రైవ్, స్మాల్ కాజ్ కేసులు 2,318
కుటుంబ తగాదా కేసులు 06
సైబర్ నేరాల కేసులు 18
ఇతర కేసులు 60
Comments
Please login to add a commentAdd a comment