
సాగుకు ఢోకా లేకుండా...
ఖమ్మంఅర్బన్: ఈ ఏడాది రబీలో జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంటలకు నష్టం జరగకుండా సాగర్ కాల్వలతో పాటు ఇతర ప్రాజెక్టుల ద్వారా నీరందించేలా జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సాగర్ ఆయకట్టు కింద 2.54 లక్షల ఎకరాలకు తోడు చెరువులు, భక్తరామదాసు, ఇతర ఎత్తిపోతల పథకాల కింద మొత్తంగా నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. జిల్లాలో అత్యధిక ఆయకట్టు సాగర్ జలాలతోనే సాగవుతోంది. దీంతో పంటలకే కాక తాగునీటి అవసరాలకు 28 టీఎంసీలు కేటాయించారు. రబీ పంటలకు వారబందీ విధానంలో నీరు విడుదల చేస్తుండగా ఇప్పటికే ఏడు తడుల్లో ఐదో తడి కొనసాగుతోంది. ఈమేరకు సుమారు 17 టీఎంసీల మేర వాడకం పూర్తయిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రెండు భాగాలుగా విభజన
సాగర్ నీటి పంపిణీ కోసం జిల్లా ఆయకట్టును రెండు భాగాలుగా చేశారు. ఏన్కూరు ఎగువ వరకు ఏడు రోజులు ఆన్, దిగువకు ఎనిమిది రోజులు ఆన్ విధానంలో సాధ్యమైనంత మేర ఆయకట్టుకు నీరు అందేలా విడుదల చేస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా పంటలకు నీటి ఎద్దడి రానివ్వొద్దని, ఎక్కడా వృథా కాకుండా సరఫరా చేయాలని చెబుతోంది. ఈ నెలాఖరు వరకు శ్రమిస్తే చాలావరకు పంటలు చేతికందే అవకాశముండడంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొన్నిచోట్ల చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేస్తుండడంతో అధికారులు అప్రమత్తమై వారబందీ విధానంలో ఇబ్బంది తలెత్తకుండా నీటి సరఫరా చేస్తున్నారు.
సాగు పూర్తయ్యాక తాగునీరు
ఏప్రిల్ రెండో వారం వరకు సాగు అవసరాలకు నీరు విడుదల చేయనున్నారు. ఆతర్వాత లంకాసాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్లతోపాటు చిన్న, మధ్య తరహా చెరువులను సైతం నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నీరు వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తారు. ఈమేరకు గత మంగళవారం జిల్లాలో పర్యటించిన జలవనరుల శాఖ ఇన్‌చార్జ్ సీఈ రమేష్‌బాబు నీటి సరఫరా తీరు, ఆయకట్టులో సాగుపై ఇంజనీర్లతో సమీక్షించారు. చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయడమేకాక వృథాను అరికట్టడంపైనా దృష్టి సారించాలని సూచించారు. సాగర్ ప్రధాన కాల్వ ద్వారా ఇన్‌ఫ్లో ఆరు వేల క్యూసెక్కులు వచ్చినప్పుడు తొమ్మిది రోజులు ఆన్, ఏడు రోజులు ఆఫ్ విధానం అమలుచేశారు. అయితే, సాగర్ నీరు జిల్లాకు చేరే సరికి 3 – 4 వేల క్యూసెక్కుల మధ్యకు తగ్గుతుండడంతో ఆన్ – ఆఫ్ విధానంలో మార్పులు చేసి జిల్లా ఆయకట్టును రెండు భాగాలుగా విభజించి నీరు అందిస్తున్నారు.
సాగర్ జలాల సరఫరాలో ఇక్కట్లు రాకుండా పర్యవేక్షణ
వచ్చే నెల రెండో వారం వరకు విడుదల
ఆతర్వాత తాగునీటి అవసరాలకు వినియోగం
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..
జిల్లాలోని చివరి ఆయకట్టుకు వరకు సాధ్యమైనంత మేర నీటి ఎద్దడి ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా శాఖ ఇంజనీర్లు నిత్యం పర్యవేక్షిస్తూ వారబందీ విధానంలో నీరు వృథా కాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం ఐదో తడి
కొనసాగుతుండగా.. మొత్తంగా ఏడు తడుల్లో నీరు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాం.
– రమేష్‌బాబు ఇన్‌చార్జ్ సీఈ, జలవనరుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment